ఏపీ రాజకీయాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నేతల్లో.. మంత్రి విడదల రజిని కూడా ఒకరని చెప్పొచ్చు. చాలా తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో రజిని గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ముందు వరకు రజిని అంటే ఎవరికి తెలియదు.. అప్పటిలో టీడీపీలో ఉంటూ ఓ చిన్నపాటి నాయకురాలుగా ఉండేవారు. కానీ 2019 ఎన్నికల ముందు ఒక్కసారిగా టీడీపీ నుంచి.. వైసీపీలో చేరి అనూహ్యంగా సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని సైతం దాటుకుని చిలకలూరిపేట సీటు దక్కించుకున్నారు. సీటు దక్కించుకోవడమే గొప్ప అనుకుంటే.. ఎన్నికల్లో బలమైన టీడీపీ సీనియర్ ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించి సంచలనం సృష్టించారు.
ఇలా తొలిసారి ఎమ్మెల్యే అయిన రజిని తక్కువ సమయంలోనే బాగా క్రేజ్ తెచ్చుకున్నారు.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇలా క్రేజ్ తెచ్చుకోవడంతో.. రెండో విడతలో రజినికి మంత్రి పదవి కూడా దక్కింది.. ఇప్పుడు మంత్రిగా ఆమె దూసుకెళుతున్నారు. ఇలా చాలా తక్కువ సమయంలో మంత్రిగా ఎదిగారు. ఇక ఇప్పటివరకు రజినికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె మళ్ళీ సులువుగా గెలిచేస్తారని అంతా అనుకోవచ్చు. కానీ అంత సులువుగా గెలవడం కుదరని పని అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ప్రత్తిపాటిపై వ్యతిరేకత ఉంది.. జగన్ గాలి ఉంది.. అలాగే సీనియర్ నేత మర్రి రాజశేఖర్ సపోర్ట్.. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మద్ధతు ఉన్నాయి.
అందుకే రజిని గెలుపు సాధ్యమైంది. కానీ ఇప్పుడు అవేమీ ఉండేలా లేవు. ప్రత్తిపాటి పుంజుకుంటున్నారు.. అటు మర్రి వర్గాన్ని రజిని ఎప్పుడో దూరం చేసుకున్నారు. ఎంపీ శ్రీకృష్ణతో విభేదాలు ఉన్నాయి.. దీని వల్ల నియోజకవర్గంలో బలమైన కమ్మ ఓటింగ్ రజినికి దూరం కానుంది. అలాగే జగన్ వేవ్ తగ్గుతుంది. ఇక సొంత ఇమేజ్ పైనే ఆధారపడి రజిని ముందుకెళ్లాలి. సోషల్ మీడియాలో పెరిగిన ఇమేజ్.. చిలకలూరిపేటలో రజిని గెలుపుకు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.