ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకుల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఈ రోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. బెయిల్ మంజూరైన వ్యవహారంపై సాంకేతిక కారణాలను చూపి బెయిల్ తెచ్చుకున్నా.. నైతికంగా మాత్రం నారాయణ తప్పించుకోలేరని మండిపడ్డారు. నారాయణ విద్యా సంస్థల చైర్ పర్సన్ హోదాలోనే నారాయణను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. అయితే 2014లోనే ఆ హోదా నుంచి నారాయణ తప్పుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లి నారాయణ బెయిల్ తెచ్చుకున్నారు.
నారాయణకు బెయిల్ వచ్చిన విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి… విద్యా సంస్థల ఛైర్మన్ పదవికి తానెప్పుడో రాజీనామా చేశానని చెప్పి బెయిలు తెచ్చుకున్నారని విమర్శించారు. సాంకేతికంగా నారాయణ బయటపడి ఉండొచ్చునన్న సాయిరెడ్డి.. నైతికంగా మాత్రం తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. నారాయణ కుటుంబానికి చెందిన సంస్థల్లో పేపర్లు బయటికొచ్చాయన్న సాయిరెడ్డి… ఈ వ్యవహారంలో ఎవరు ఓడారో ప్రజలకు అర్థమైందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు విజయసాయిరెడ్డి.