వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన సాయిరెడ్డి.. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సాయిరెడ్డి వరుసగా 5 ట్వీట్లు సంధించారు. చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చిదంబరంకు నైతికతే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలని సూచించారు విజయసాయిరెడ్డి.
మనీ ల్యాండరింగ్ నుంచి చైనా పౌరులకు లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించారని చిదంబరంపై సాయిరెడ్డి మరింత ఘాటు విమర్శలు గుప్పించారు. కేబినెట్ మంత్రి హోదాలో చిదంబరం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. తాను చేసిన అన్ని తప్పులకు చిదంబరం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తక్షణమే చిదంబరంను అరెస్ట్ చేయాలని ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా పోస్ట్ చేసిన సాయిరెడ్డి… 2004- 14 మధ్యలో కేంద్ర మంత్రి హోదాలో చిదంబరం తీసుకున్న అన్ని నిర్ణయాలు, వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.