కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పాలన పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది. స్వయం ఉపాధి పొందాలనుకున్న బీసీ యువతకు లోన్లు ఇస్తామంటూ ప్రభుత్వం 2018లో ప్రకటించింది. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు 80 శాతం, 70, 50 శాతం సబ్సిడీతో లోన్లు ఇస్తామని చెప్పింది. దీంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు అప్లికేషన్లకు మోక్షం కలగడం లేదు. దరఖాస్తులు వేలల్లో వస్తే కేవలం కొద్ది మందికే సగం సగం డబ్బులు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని నిప్పులు చెరిగారు.
దీంతో ప్రభుత్వం సాయంతో సొంతగా వ్యాపారం చేసుకోవాలనుకున్న వేలాది మంది నిరుద్యోగులకు నాలుగేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక్క యాదాద్రి జిల్లాలోనే బీసీ కార్పొరేషన్‌కు 7,096 మంది, బీసీ ఫెడరేషన్‌కు 6,504 మంది, ఎంబీసీ కార్పొరేషన్‌కు 581తో కలిపి మొత్తం 14,181 మంది నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో రూ. లక్ష లోన్ కోసం 1,249 మంది, రూ.2 లక్షల కోసం 4,088, రూ.10 లక్షల లోపు లోన్ల కోసం 7,856 మంది అప్లై చేసుకున్నారు. వీరంతా పాడి పరిశ్రమ, ఆటోలు, షాపులు, కంపెనీలు ఏర్పాటు చేస్తామంటూ దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా లోన్ల కోసం 27 వేల మంది అప్లై చేసుకున్నారు. ఇలా అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు అప్లై చేసుకున్నారన్నారు.
అయినా కేసీఆర్ సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు. అటు ఉద్యోగాలు దొరకక, ఇటు స్వయం ఉపాధి లేక వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే తమకు లోన్ మంజూరు చేయాలని బీసీ వెల్ఫేర్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 2018లో ఎన్నికల ముందే లోన్లు మంజూరు చేశామని కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మాటలా మిగిలిపోయాయి. ఎలక్షన్లు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చే కేసీఆర్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన గుణపాఠం చెబుతుందని విమర్శలు చేశారు విజయశాంతి.