ఏపీలో వరుసుగా అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు దిశా యాప్ పటిష్ట అమలుకోసం ఒక వాహనంను ఏర్పాట్లు చేయనున్నట్లు విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు. 24 గంటలు ఆ వాహనం ద్వారా దిశా ప్రత్యేక బృందాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో నేర ప్రభావిత ప్రాంతాలలో గస్తీ కాస్తాయని ఆయన వెల్లడించారు.
అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్, వాహనాల తనిఖీ, దిశా యాప్ పై ప్రజలకు అవగాహన యాప్ రిజిస్ట్రేషన్స్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దిశా అప్లికేషన్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలని ఆయన సూచించారు. ఆపద సమయంలో దిశా యాప్ ద్వారా వెంటనే నగర పోలీస్ వారి సహకారాన్ని పొందవచ్చని, దిశా యూజర్ ఫ్రెండ్లీ యాప్ అని ఆయన పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం నగర పోలీస్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.