బెజవాడ వైసీపీలో ఏం జరుగుతుంది..మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న నేతల మధ్య కోల్డ్ వార్ ఎందుకు మొదలైంది. కార్పోరేషన్ ఎన్నికలు నేతల మధ్య దూరం పెంచాయా లేక ఆదిపత్యం కోసం ఎడమోహం పెడమోహంగా మారారా అన్నది బెజవాడ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధ్య వర్గపోరు మొన్నటి వరకు ఈ ఇద్దరి సన్నిహితులకే తెలిసిన విషయం.. ఇప్పుడు పార్టీ పెద్దల దృష్టికి కూడా వెళ్లిందట. దీనిపైనే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.
వెల్లంపల్లి శ్రీనివాస్ బెజవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు మంత్రయ్యారు. ఇక విష్ణు కూడా మూడు సార్లు ఎన్నికల బరిలో దిగి రెండు సార్లు గెలిచారు. 2009లోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనస్పర్దలకు కారణం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బెజవాడ సిటీలో పక్కపక్క నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరూ.. ఇప్పుడు ఎడమోహం పెడమోహంగా ఉండటాన్ని చూసి పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
వెల్లంపల్లి, విష్ణు.. ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ.. విష్ణు ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు. పీసీసీ కార్యదర్శిగా, వుడా చైర్మన్ గా వైఎస్ హయాంలో బెజవాడలో తన హవా చూపించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది మాత్రం.. 2009లోనే. విష్ణు కాంగ్రెస్ నుంచి, వెల్లంపల్లి ప్రజా రాజ్యం తరఫున పోటీ చేశారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం కావటంతో.. వెల్లంపల్లి కూడా కాంగ్రెస్‌లో ఇమిడిపోయి విష్ణుతో స్నేహం చేశారు. ఆ దోస్తీ.. ఇప్పటి వరకు కొనసాగుతూనే వచ్చింది. వెల్లంపల్లి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా అంతా బాగానే ఉంది. గత ఆరు నెలల నుంచి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని సన్నిహితుల టాక్.
బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ సీట్ల సర్దుబాటు విషయంలో.. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. గత ఏడాది మార్చిలో ఈ ఎన్నికలు జరుగుతాయని ముందుగానే సీట్లను కేటాయించారు. వెల్లంపల్లి తన అనుచరుడి కోసం అడిగిన ఒక సీటును.. మారుమాట్లాడకుండా విష్ణు తన నియోజకవర్గంలో ఇచ్చారట. కానీ, విష్ణు అడిగిన సీటును వెలంపల్లి సర్దుబాటు చేయలేక పోయారట. ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇద్దరి మధ్యా తేడాలు వచ్చాయనే టాక్ నడుస్తుంది.
మొదట సిటీ నుంచి తనకి మంత్రి పదవి వస్తుందని ఆశించిన మల్లాదికి సామాజిక సమీకరణాల వల్ల పదవి రాలేదు. దీంతో అప్పటి నుంచే విష్ణు లోలోపల ఆవేదనగా ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా విష్ణు సంతృప్తిగా లేరట. దీంతో వెల్లంపల్లి రెండున్నరేళ్ల మంత్రి పదవీ కాలం ముగిసిన తర్వాత తాను ఆ కోటాలో మంత్రి పదవి పొందాలనేది విష్ణు ఆలోచనగా ఉందట. అయితే ఆర్య వైశ్య సంఘాలు.. రెండున్నరేళ్ల తర్వాత కూడా వెల్లంపల్లిని కొనసాగించాలని కోరటానికి సిద్ధమయ్యారట. ఇది ఆ ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందట.
ఇటీవల ఆలయాల, ఆశ్రమాల టూర్ కూడా.. పార్టీ అగ్రనేతల ఆదేశాల మేరకే ఈ ఇద్దరూ తప్పక వెళ్లారని సమాచారం. అక్కడా ఎడమొహం పెడమొహంగానే ఈ ఇద్దరు నేతలు ఉన్నారని అంటున్నారు.