టెన్నిస్ జెంటిల్మెన్ రోజర్ ఫెదరర్‌పై క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఓ వీడియో సందేశం పంపించి ఫెదరర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. స్విస్ సూపర్ స్టార్ కోసం కింగ్ కోహ్లీ చేసిన ఈ వీడియోను ఏటీపీ టూర్ (ది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా 2015, 2018లో ఆస్ట్రేలియాలో ఫెదరర్‌ను కలిసిన విషయాన్ని కూడా విరాట్ గుర్తు చేసుకున్నాడు.
‘‘హలో రోజర్, మాకు అందమైన క్షణాలు, జ్ఞాపకాలను అందించిన నీ అద్భుతమైన కెరీర్‌ను అభినందిస్తూ వీడియో సందేశం పంపడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ఈ సందేశం సాగింది. ‘‘2018 ఆస్ట్రేలియా ఓపెన్‌లో నిన్ను కలుసకోవడాన్ని ఎప్పటికీ మరచి పోలేను. టెన్నిస్‌ను దాటుకొని ప్రపంచం నలుమూలల నుంచి నీకు లభిస్తున్న మద్దతు, సంఘీభావం.. నేను మరే అథ్లెట్ విషయంలో చూడలేదు. నా వరకు నువ్వెప్పుడూ అత్యుత్తమ అటగాడివే’’ అని ఫెదరర్‌ను కోహ్లీ పొగిడారు. ఫెదరర్ ఇటీవల లావెర్ కప్-2022లో అంతర్జాతీయ టెన్నిస్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.