త్వరలో కేసీఆర్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేనను ఆహ్వానించక్కర్లేదని.. బీజేపీ-జనసేన ఒకటే.. పవన్ మా ఇంట్లో అతిథి అన్నారు. ప్రధాని తెలంగాణలో పర్యటిస్తుంటే చిల్లర రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీను కూడా పిలిచామని.. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆగ్రహించారు.
ప్రధానికి ఆహ్వానం పలకకపోవడం కేసీఆర్ దొరతనమని… గతంలో హోర్డింగులు కట్టిన వాళ్ళేమయ్యారో చరిత్రలో చూడచ్చన్నారు. రాష్ట్రాభివృద్ధిపై కెసిఆరుకు ప్రేమ ఉంటే మోడీతో చర్చించాలని.. తెలంగాణలో ఆత్మహత్యలు గురించి కేసీఆర్ ఆలోచించాలని చురకలు అంటించారు. ప్రధాని వస్తుంటే పోటీగా టూ వీలర్ ర్యాలీలు పెట్టడం సిగ్గుచేటు అని… కెసీఆర్ అడుగు పెట్టాక మహారాష్ట్ర ఏమైందో అందరికీ కనిపించిందని ఎద్దేవా చేశారు. దళిత వ్యతిరేక నాయకుడు కేసీఆర్ అని.. బీజేపీ బహిష్కరించిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా తెచ్చారని మండిపడ్డారు.