తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే.. గత కొన్నేళ్లుగా వీఆర్‌వో ఏ శాఖలోనూ శాశ్వత ఉద్యోగాలు లభించక.. వివిధ శాఖల్లో పనులు చేస్తున్నారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ వీఆర్‌వోలకు న్యాయం చేస్తామని వారికి వివిధ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు కేటాయిస్తామన్నారు. ఈనేపథ్యంలోనే.. ఇతర శాఖల్లోకి వీఆర్వోల సర్దుబాటు విజయవంతంగా ముగిసింది. 98 శాతం వీఆర్వోలు ఇప్పటి వరకు తమకు కేటాయించిన శాఖల్లో చేరారు.
రాష్ట్రంలో 5,137 మంది వీఆర్వోలు ఉండగా, ఇప్పటివరకు 5,014 మంది వారికి కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు. కేవలం 123 మంది వీఆర్వోలు మాత్రమే వారికి కేటాయించిన శాఖల్లో చేరలేదు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో కొంత మంది రిట్‌పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పిటిషనర్లకు మాత్రమే స్టేటస్‌కో ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో చట్టంలోని నిబంధనల ప్రకారం వీఆర్‌ఎస్ సహా డ్యూటీకి రిపోర్ట్ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది.