దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, విదర్భాలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల వేగం కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ, మధ్య వాయువ్య బంగాళాఖాతం, చత్తీస్‌గడ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, మరోవైపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రవేశించే రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా రుతు పవనాల కదలికల్లో వేగం పెరిగింది.