సాధారణంగా ఏ రంగంలో ఉండే అధికారులైన…అధికార పార్టీకి అనుకూలంగా నడుచుకుంటారనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పోలీసులు…ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు సహజంగానే వస్తాయి. అధికార పార్టీ మాట వినకుండా ముందుకెళితే వారికి ఇబ్బందులు తప్పవు. అందుకే ఎవరైనా సరే అధికార పార్టీ చెప్పినట్లే నడుచుకుంటారు.
అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు పోలీసులు అనుకూలంగా నడుచుకుంటున్నారని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నాయి. అలాగే పోలీసులు సైతం ప్రతిపక్షాలు చేసే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు బ్రేక్ వేస్తూ, అధికార పార్టీకి లబ్ది చేకూరేలా వ్యవహరిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురుకుంటున్న పోలీసులు హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా ముందుకెళుతున్నారని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు.
అయితే ఎక్కడకక్కడ బీజేపీ శ్రేణులని, ఈటల అనుచరులని, అభిమానులకు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయంపై కూడా ఈటల సీరియస్‌గా ఉన్నారు. ఒకానొక సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈటల…అక్కడే మీడియా సమావేశం పెట్టి మరీ హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అడ్డగోలుగా వెళుతుందని, అక్రమ సంపాదనని హుజూరాబాద్‌లో పంచుతున్నారని ఆరోపించారు.
అదే సమయంలో హుజురాబాద్‌లో పోలీసులు మఫ్టీలో తిరుగుతూ, టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారనే విధంగా విమర్శలు చేశారు. అయితే దుబ్బాక ఉపఎన్నిక సమయంలో కూడా బీజేపీ నేతలు, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా నడుస్తూ, తమని ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కానీ అక్కడ బీజేపీకే అనుకూలమైన ఫలితం వచ్చింది. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విషయం అక్కడి ప్రజలకు అర్ధమైతే, టీఆర్ఎస్‌కే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.