సామాజిక మాధ్యమాల్లో పంపించుకునే మెసేజ్‌లను సాక్ష్యాలుగా అంగీకరించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వాట్సాప్ వంటి సోషల్ ప్లాట్‌ఫాంలపై రోజూ ఎన్నో మెసేజ్‌లను పంపించుకుంటారని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్‌లు ఏఎస్ బొప్పన్న, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పై విధంగా తెలిపింది.
వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ప్రస్తుత తరుణంలో దేన్నయినా క్రియేట్ చేయవచ్చు. దేన్నయినా డిలీట్ చేయవచ్చు. అందువల్ల ఆయా మాధ్యమాల్లో పంపించుకునే మెసేజ్‌లను సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ఆ మెసేజ్‌లకు విలువ ఉండదని పేర్కొంది.
కాగా వాట్సాప్ అమలు చేస్తున్న నూతన ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో వాదోపవాదాలు జరగ్గా.. డేటా ప్రొటెక్షన్ బిల్ అమలులోకి వచ్చే వరకు తాము కొత్త ప్రైవసీ పాలసీని కొనసాగించకుండా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే మెసేజ్‌లను సాక్ష్యాలుగా పరిగణించలేం అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇకపై సోషల్ ప్లాట్‌ఫాంలలోని మెసేజ్‌లను సాక్ష్యాలుగా అంగీకరించలేరు. గతంలో పలు కోర్టులు ఆ మెసేజ్‌లను సాక్ష్యాలుగా తీసుకోవచ్చని తీర్పులు చెప్పాయి. అయితే సుప్రీం కోర్టు మాత్రం అందుకు విరుద్ధంగా తీర్పు చెప్పడం విశేషం.