ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ లేదా లేనప్పుడు కానీ ఒక విధం అయిన పొలిటిక్స్ నడిచాయి. ఆ విధంగా కొంత విస్తృతి పొందిన కాంగ్రెస్ తరువాత అదే రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఊహించని తిరుగుబాటును చవి చూసి సంబంధిత కాలంలో ఖంగుతింది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి కి ప్రశాంత్ కిశోర్ అనే స్ట్రాటజిస్ట్ పరిచయం కావడం కొంత మేలు కొంత కీడు జరిగాయి అన్నది ఇప్పటికీ వైసీపీ ఒప్పుకునే అత్యంత నమ్మదగ్గ నిజాలలో ఇదొక్కటి. ఇదొక్కటి కాదు ఇదొక్కటే ! ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జగన్ కూడా తన రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు అన్నది వాస్తవం. పార్టీలో కొందరు సీనియర్లు వచ్చినా, లేదా నాన్న దగ్గర ఉన్న నాయకులు తన దగ్గర విధేయులుగా లేకపోయినా జగన్ పార్టీని నడిపారు. ఆ విధంగా బొత్స ఆ విధంగా ధర్మాన ఇవాళ పదవులు పొందారు. నాటి చరిష్మాను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా! ఇప్పుడు జగన్ కు ప్రశాంత్ కిశోర్ తో పనిలేదు.
ఓ విధంగా ఆ రోజు నవ రత్నాల ప్రకటన లేకపోయినా జగన్ గెలిచే వారు. కనుక ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తి కొంత పక్కదోవ పట్టించిన మాట వాస్తవం. ఆర్థిక స్థితిగతులు తెలుసుకోకుండానో లేదా అంచనా వేయకుండానో ఆ రోజు ఫీజు రీ యింబర్స్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడో లేదా ఆరోగ్య శ్రీని ఎనౌన్స్ చేసినప్పుడో రోశయ్య లాంటి ఆర్థిక మంత్రులు వైస్సార్ పై కోపం అయ్యారు.
కానీ అంతకుమించి లక్ష కోట్ల రూపాయలను ఏడాదికి సంక్షేమానికే కేటాయించాలంటే అదీ అవశేషాంధ్రకు సంబంధించి కేటాయించాలంటే ఏ ప్రభుత్వానికి అయినా కష్ట సాధ్యమే ! ఇంకా చెప్పాలంటే జగన్ ఓ విధంగా సాహసంతో సావాసం చేస్తున్నారు. అప్పులు ఉన్నా కూడా ప్రజలకు తాను ఇచ్చిన మాటే పరమావధి కనుక .. ఆ దిశగా సంబంధిత చర్యలు లేదా పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కారణంగా ఇవాళ వస్తున్న ఇబ్బందులను జగన్ దాట లేకపోతున్నారు కూడా! అందుకే ఆయన వల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అన్న చర్చ కాంగ్రెస్ విషయమై నడుస్తోంది.
ఈ నేపథ్యాన ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు ప్లాస్టిక్ లాంటి వాళ్లు. ప్లాస్టిక్ తో ప్రస్తుతం బాగానే ఉన్నా,తరువాత జీవితం ఎంత ప్రమాదమో..! అదేవిధంగా వీళ్లతో స్నేహం కారణంగా దేశం ఓ సంకట స్థితిని మున్ముందు చూడాల్సి వస్తుంది అన్నది ఓ నెటిజన్ అభిప్రాయం. ఇందులో ఎంతో నిజం ఉంది. అదేవిధంగా జాగ్రత్త పడమన్న భావన కూడా ఉంది. త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల జీవితాన్ని మార్చేది ప్రశాంత్ కిశోరే అని తెలుస్తోంది. ఆ విధంగా ఆయన ఆ పార్టీ భవిష్యత్ రేఖలను సైతం సరిదిద్ది కొత్త జీవితాన్నే అక్కడి నాయకులకు ప్రసాదించనున్నారని కూడా ఓ ఆశాభావ ప్రకటన సంబంధిత నాయకుల నుంచి రావడం ఓ విధంగా విస్తుబోవాల్సిన పరిణామం. ఇంతకూ ప్రశాంత్ కిశోర్ అంతా మంచే చేస్తాడా? ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోండి !