మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్ష చేస్తూ శివున్ని అర్చిస్తే ఎవరైనా మరణానంతరం కైలాసం చేరుకుంటారని, వారికి పుణ్యం దక్కుతుందని, మరుసటి జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.త్రిమూర్తులలో ఒకడైన శివుడు లింగంగా ఉద్భవించిన పవిత్రమైన రోజునే మహాశివరాత్రి అంటారు. చాలా మంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేస్తారు. మరుసటి రోజు శివున్ని దర్శించుకుని ఉపవాస దీక్ష విడుస్తారు. అయితే దైవం కోసం ఉపవాసం ఉంటే పుణ్యం దక్కుతుందని చెప్పి చాలా మంది ఉపవాస దీక్ష చేస్తారు సరే..
కానీ మహాశివరాత్రి రోజు రాత్రి నిద్రపోకుండా జాగారం ఎందుకు చేస్తారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలో తెలియజేసే కథ ఒకటి మన పురాణాల్లో ఉంది. అదేమిటంటే… పూర్వం వారణాసిలో సుస్వరుడనే బోయవాడు ఉండే వాడు. అతను రోజూ అడవిలో తిరుగుతూ జంతువులను లేదా పక్షులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి కుటుంబం గడుపుతుంటాడు. అదే అతనికి జీవనోపాధి. అయితే ఒక రోజు అడవిలో ఎంత తిరిగినా ఒక్క జంతువు గానీ, పక్షి గానీ కనిపించదు. దీంతో అతను దిగులు చెందుతాడు. ఇంటి వద్ద తన కోసంఎదురుచూసే భార్యా పిల్లల కడుపు ఎలా నింపాలా అని అతను దుఃఖిస్తూ.. ఒక బిల్వ వృక్షం వద్దకు చేరుకుని ఆ చెట్టు ఎక్కుతాడు. అప్పటికి రాత్రి అవుతుంది. ఆ రోజంతా ఏమీ తినకపోవడం వల్ల బోయవాడికి నిస్సత్తువ ఆవహిస్తుంది.
అయితే రాత్రంతా ఎలా కాలక్షేపం చేయాలా.. అని చెట్టుపై ఉండి చూస్తున్న ఆ బోయవాడికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ బిల్వ వృక్షానికి చెందిన ఆకులను ఒక్కొక్కటి తెంచి కింద పడేస్తుంటాడు. అయితే ఆ ఆకులు చెట్టు కిందే ఉన్న ఓ శివలింగంపై పడుతుంటాయి. ఈ క్రమంలో రాత్రంతా అతను అలా ఆకులను తెంచి మేల్కొని ఉండి తెల్లవారగానే ఇంటికి చేరుకుంటాడు. తరువాత అతని మరణానంతరం ఆ బోయవాడు నేరుగా కైలాసం చేరుకుంటాడు.
నిజానికి ఆ రోజు మహాశివరాత్రి. ఆ విషయం ఆ బోయవాడికి తెలియదు. దీంతో అనుకోకుండానే అతను ఏమీ తినకపోవడం వల్ల ఉపవాస దీక్ష చేసినట్లు అవుతుంది. అలాగే రాత్రంతా బిల్వ వృక్ష ఆకులను తెంచి తెలియకుండానే శివలింగం మీద వేస్తాడు. నిద్రపోకుండా జాగరణ చేస్తూ తనకు తెలియకుండానే ఆ బోయవాడు శివలింగాన్ని అర్చిస్తాడు. దీంతో మహాశివరాత్రి రోజు అతను ఉపవాసం, జాగరణ, శివార్చన చేసినందుకు గాను ఆ బోయవాడికి మరణానంతరం కైలాసం ప్రాపిస్తుంది. దీంతోపాటు ఎంతో పుణ్యఫలం దక్కుతుందని, మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి. కనుక మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్ష చేస్తూ శివున్ని అర్చిస్తే ఎవరైనా మరణానంతరం కైలాసం చేరుకుంటారని, వారికి పుణ్యం దక్కుతుందని, మరుసటి జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి రోజు కచ్చితంగా ఉపవాసం, జాగరణ దీక్ష చేయాలని పండితులు చెబుతుంటారు. ఇదీ మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్షలు చేయడం వెనుక ఉన్న అసలు కారణం..!
మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలంటే..?
మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి అవేమిటంటే…
1. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం తరువాతి రోజు మాంసాహారం తినరాదు. మద్యపానం చేయరాదు.
2. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తలంటు స్నానం చేయాలి. శివాలయం వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. రోజంతా శివనామ స్మరణ చేయాలి.
3. రాత్రి పూట శివలింగానిఇ పూజలు చేస్తూ జాగారం ఉండాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినా సరే.. బిల్వార్చన చేయవచ్చు. అభిషేకం చేయవచ్చు.
4. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండడం అంటే.. కొందరు అన్నం, చపాతీలకు బదులుగా పండ్లను విపరీతంగా తింటారు. అది మంచిది కాదు. ఉపవాసం అంటే.. ఉపవాసమే.. ఉపవాసం.. అంటే అసలు ఏమీ తినవద్దని, తాగవద్దని అర్థం. కానీ దాన్ని ప్రస్తుతం మార్చేశారు. ఉపవాసం అంటే.. పండ్లను తినవచ్చనే భావన చాలా మందిలో ఉంది. అది సరికాదు. ఉపవాసం.. అంటే అసలు ఏమీ తినకూడదు..!
5. జాగరణ పేరిట కొందరు రాత్రంతా సినిమాలు చూస్తారు. కొందరు ఆటలు ఆడుతారు. ఇంకా కొందరు వేర్వేరు పనుల్లో నిమగ్నమవుతారు. ఇది సరికాదు. జాగరణ అంటే.. రాత్రంతా మేల్కొని శివనామ స్మరణ చేయాలి. లేదా శివలింగాన్ని పూజించాలి.
6. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేస్తే అనుకున్నవి నెరవేరుతాయట. ఎన్నో వేల సార్లు దైవాన్ని పూజించినా దక్కని పుణ్య ఫలితం ఒక్క రోజు ఉపవాసం, జాగరణతో దక్కుతుందట.
7. శివరాత్రి నాడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని రోజంతా స్మరించాలి.
8. మహాశివరాత్రి రోజు రాత్రి పూట జాగరణ చేసి ఉదయాన్నే శివాలయం సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చాకే ఉపవాసం ముగించాలి. అలాగే శివరాత్రి రోజు జాగరణ చేసిన వారు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రించరాదు. అలా చేస్తేనే సంపూర్ణ ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.