హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. చాలా మంది హిందువులు శివ రాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేస్తారు. ఆలయాల్లో అయితే భక్తులు పెద్ద సంఖ్య లో వచ్చి భక్తి శ్రద్ధల తో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుద్రాభిషేకం చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం లాంటివి ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా చేస్తూ ఉంటారు.
అలాగే రాత్రి అంతా కూడా శివాలయాల్లో భజనలు, పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. పవిత్రమైన ఈ రోజున శుభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తారు. పంచామృతాల తో అభిషేకం చేసి శివుడికి ప్రీతికరమైన ఉమ్మెత పూల తో, మారేడు దళాల తో పూజ చేసి, ధూప దీప నైవేద్యాలను అర్పిస్తారు.
ఇలా మహా శివ రాత్రి రోజు ఇవన్నీ చేస్తారు. అయితే ఈరోజు ఉపవాసం ఎందుకు ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం..! మహా శివ రాత్రి నాడు అనేక మంది భక్తి శ్రద్ధల తో ఉపవాసం చేస్తారు. పూజలు చేయడం అభిషేకాలు చేయడం ఇవన్నీ పక్కన పెడితే ఉపవాసం ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.
మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి దేవుడిని ఆరాధించడం వల్ల తమకు మంచి భర్త వస్తారని మహిళలు నమ్ముతారు. ఎవరికైనా చాలా కాలం నుండి వివాహం జరగకపోతే ఉపవాసం చేయడం వల్ల అడ్డంకులు ఏమైనా ఉంటే ఉపవాసం చేయడం వల్ల తొలగిపోతాయని పండితులు అంటున్నారు.
వివాహానికి ఉన్న అడ్డంకిని తొలగించడం లో ఉపవాసం చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని అంటూ ఉంటారు. ఇలా ఉపవాసం చేస్తే దేవుడి ఆశీర్వాదం దొరుకుతుందని, వివాహం జరుగుతుందని నమ్ముతారు. అలానే శివునికి పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల జీవితం లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.