అనుమానాలు, వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మూడు ముళ్ల బంధానికి కట్టుబడి ఉండలేక.. అడ్డదారులు తొక్కుతున్నారు. కొద్ది క్షణాల సుఖం కోసం జీవితాన్నే అంధకారంలో నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అల్లిపురానికి చెందిన వీరబాబు భార్య.. అదే గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి విషయం వీరబాబుకు తెలియడంతో.. పలుమార్లు భార్యకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు.
దీంతో దంపతులిద్దరు ఖమ్మం శివారులోని గోపాలపురానికి మకాం మార్చారు. అయినా.. నవీన్ ఆదివారం రాత్రి వీరబాబు ఇంటికి వెళ్లాడు. అతని భార్య, నవీన్ ఏకాంతంగా ఉన్నప్పుడు.. అప్పుడే ఇంటికి వచ్చిన వీరబాబు అది చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే కత్తితో వారిపై దాడి చేయగా.. నవీన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఖానాపురం హవేలి పోలీసులు అక్కడికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.