కష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అండగా నిలవడానికే వైఎస్ షర్మిల ఇక్కడకు వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న న్యాయసాధన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ‘అచ్చోసిన ఆంబోతుల్లా వారిద్దరూ తలపడుతుంటే ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం ఆషామాషీ కాదని ఆమెకు తెలుసు. అయినా సరే పోరాటం చేయడానికి షర్మిల ముందుకొచ్చారు అని అన్నారు. ఆమె నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలి అని కోరారు. ఆమె ఏపీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే వరకు నేను తోడుగా ఉంటా’ అని హామీ ఇచ్చారు.
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు అని విమర్శించారు.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు అని ఆరోపించారు . పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు’ అని ఆయన విమర్శించారు.