స‌మోసా, బ‌జ్జీ, పిజ్జా, బ‌ర్గ‌ర్‌, కేకులు, కుకీస్‌.. త‌దిత‌ర జంక్ ఫుడ్‌ను నిషేధిస్తారా..?

-

స‌మోసాలు, బ‌జ్జీలు, పూరీలు, వ‌డ‌లు, పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, కేకులు, చిప్స్‌, కుకీస్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే నాలుకకు రుచిక‌రంగా అనిపించే ఎన్నో చిరుతిళ్లు ప్ర‌స్తుతం మ‌నకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ నిజానికి మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావ‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. ఎందుకంటే.. ఈ ఆహారాల్లో కొవ్వు ప‌దార్థాలు బాగా ఉంటాయి. అందువ‌ల్ల వీటితో మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని కూడా వైద్యులు చెబుతుంటారు. అయితే ఇక‌పై ఈ ఆహార ప‌దార్థాల‌ను మ‌న దేశంలో నిషేధించ‌నున్నారా ? అంటే.. అందుకు అవుననే స‌మాధానం వినిపిస్తోంది.

చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ను ఎందుకు నిషేధిస్తారు ? అని ఆశ్చ‌ర్య‌పోకండి. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. వీటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్ అంటే.. వంట నూనెల‌ను బాగా వేడి చేయ‌డం వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. ఇక వ‌న‌స్ప‌తి నూనెల్లో స‌హ‌జంగానే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సాధార‌ణంగా ఫ్యాట్స్ రెండు ర‌కాలు. శాచురేటెడ్‌, అన్‌శాచురేటెడ్ అని. ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్ అన్‌శాచురేటెడ్ కింద‌కు వ‌స్తాయి. కానీ మిగిలిన అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ క‌న్నా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ప్రమాద‌క‌రం. వంట నూనెల‌ను హైడ్రోజ‌నీక‌ర‌ణం చేసిన‌ప్పుడు ఆ నూనెల్లో ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్ ఏర్ప‌డ‌తాయి. వంట నూనెల‌తో త‌యారు చేసే ప‌దార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండ‌డానికి, అవి మంచి వాస‌న రావ‌డానికి, నూనెల‌ను ఎన్ని సార్లు వేడి చేసి అయినా ఉప‌యోగించుకునేందుకు వీలుగా వాటిని ప‌రిశ్ర‌మల్లో హైడ్రోజ‌నీక‌ర‌ణం చెందిస్తారు. అప్పుడు ఆ నూనెల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఏర్ప‌డ‌తాయి.

ఇక ఇలా ఏర్ప‌డే ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉండే నూనెల‌తో పైన చెప్పిన చిరుతిళ్ల‌ను త‌యారు చేసిన‌ప్పుడు నూనెను చాలా సార్లు మ‌రిగిస్తారు. దీని వ‌ల్ల ఆహార ప‌దార్థాల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ మోతాదు మ‌రింత పెరుగుతుంది. అలా ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉండే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ను మ‌నం ప్ర‌స్తుతం బాగా తింటున్నాం. కానీ దాని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మాత్రం మ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు. ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉండే ఆహారాల‌ను తింటే.. మన శ‌రీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌) పెరుగుతుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్‌) త‌గ్గుతుంది. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి అవి బ్లాక్ అవుతాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్స్ వ‌స్తాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులే కాదు, ఒబెసిటీ (అధిక బ‌రువు), డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉండే ఆహారాల‌ను, నూనెల‌ను వెంట‌నే నిషేధించాల‌ని ఇప్ప‌టికే హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఎఫ్ఐ) వైద్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాగా ట్రాన్స్‌ఫ్యాట్లు ఉండే ఆహార ప‌దార్థాల‌ను, నూనెల‌ను గ‌తేడాది జూన్ 18 నుంచి అమెరికాలో బ్యాన్ చేశారు. దీంతో వాటిని మ‌న దేశంలోనూ బ్యాన్ చేయాల‌ని వైద్యులు కోరుతున్నారు.

వైద్యులు సూచించిన‌ట్లుగా మ‌న దేశంలోనూ ట్రాన్స్‌ఫ్యాట్లు ఉండే ఆహారాలు, నూనెల‌ను బ్యాన్ చేస్తే అప్పుడు పైన చెప్పిన చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌ను అమ్మేందుకు వీలులేదు. ఒక వేళ అమ్మినా వాటిలో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎంత మోతాదులో ఉన్నాయో తెలియజేసే స్టిక్క‌ర్ల‌ను వేయాలి. కానీ సహ‌జంగా ఈ ప‌దార్థాల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇక మ‌న‌కు బ‌జార్లో తోపుడు బండ్ల మీద చిరుతిళ్లను బాగానే అమ్ముతారు. కానీ వారు ప‌దార్థాల‌పై ట్రాన్స్‌ఫ్యాట్ ఇంత మోతాదులో ఉంది అని తెలియ‌జేసే స్టిక్క‌ర్ల‌ను వేయ‌రు క‌దా. అందువ‌ల్ల ట్రాన్స్‌ఫ్యాట్ల‌ను నిషేధిస్తే అలాంటి చిరు వ్యాపారులు ఇక త‌మ వ్యాపారాల‌ను కొన‌సాగించ‌లేరు. కానీ దేశంలో ట్రాన్స్‌ఫ్యాట్స్ తింటున్న అనేక మంది హార్ట్ ఎటాక్‌ల‌తో మ‌ర‌ణిస్తున్న దృష్ట్యా కేంద్రం వాటిని బ్యాన్ చేస్తుంద‌నే వైద్యులు ఆశిస్తున్నారు. చూద్దాం మ‌రి.. ఏం జ‌రుగుతుందో. ఏది ఏమైనా.. మీరు మాత్రం ట్రాన్స్‌ఫ్యాట్లు ఉన్న ఆహారాల‌ను తిన‌కండి. వాటి వల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఆ త‌రువాత మీరే భారం వ‌హించాల్సి వ‌స్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version