ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నాయకుడు గొట్టిపాటి రవి కుమార్. స్థానికంగా ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ సంపాయించుకున్నారు. పార్టీలు ఏవైనా.. నియోజకవర్గంలో ఆయన దూకుడు ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. కాంగ్రెస్‌తో రాజకీయాలు ప్రారంభించిన రవి.. హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009, 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. అయితే.. ప్రతి విజయమూ.. గొట్టిపాటికి ప్రత్యేకమనే చెప్పాలి. 2009లో కాంగ్రెస్ తరఫున విజయం దక్కించుకున్నారు. 2014లో వైసీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు.
ఇక, 2019లో టీడీపీ టికెట్‌పై గొట్టిపాటి విజయం సాధించారు. అంటే. మొత్తంగా మూడు ఎన్నికలు, మూడు పార్టీలు.. విజయం మాత్రం గొట్టిపాటినే వరించింది. దీని వెనుక పార్టీలపై ప్రజలకు ఉన్న అభిమానం కం టే.. నాయకుడిగా గొట్టిపాటిపై ఉన్న అత్యంత విశ్వాసమే కారణంగా కనిపిస్తోంది. అయితే.. కొన్నాళ్లుగా జ రుగుతున్న పరిణామాలను గమనిస్తే.. గొట్టిపాటిని తిరిగి వైసీపీలోకి తీసుకునేందుకు అధికార పార్టీ ప్రయ త్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాపారాలపైనా అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. అప్పటికీ గొట్టిపాటి మాట వినడం లేదనే విషయం తెలిసిందే. ఇక, వైసీపీ ప్రయత్నాలు మరో రూపంలో ఉంటున్నాయని అంటున్నారు అద్దంకి రాజకీయ పరిశీలకులు. అదేంటంటే.. గొట్టిపాటిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చూపిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన బయటకు రావడం లేదు. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఆయన బయటకు రాని మాట వాస్తవమే. కానీ, ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారనే అంటున్నారు రవి వర్గీయులు.
అయితే.. వైసీపీ మాత్రం అంతర్గత ప్రచారం చేస్తోంది. రవి వల్ల నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని.. ఆయన బయటకు రావడం లేదని వైసీపీ నేతలు సోషల్ మీడియా సహా స్థానిక చానెళ్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. గొట్టిపాటికి సపోర్టుగా టీడీపీ నేతలు బయటకు రావడం లేదు. వాళ్లు-వాళ్లు చూసుకుంటారులే! అనే ధీమాతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది దీంతో.. గొట్టిపాటి ఒంటరి అయ్యారా ? అనే సందేహాలు ఆయన వర్గంలో వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ రాజకీయ ఎత్తుగడలను రవి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.