ఎట్టకేలకు బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్…తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో వరుసపెట్టి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన, ఈటల ఊహించని విధంగా ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో కేసీఆర్‌ని కూడా ఇరుకున పెట్టారు. ఎందుకంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. కానీ వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించలేదు.
కానీ ఈటల రాజీనామా చేసి సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఇక ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక పోరులో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బరిలో నిలబడుతున్నారు. అటు టీఆర్ఎస్..ఈటల రాజేందర్ కు ధీటైన నాయకుడుని నిలబెట్టడానికి చూస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. అయితే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్…తన సొంత బలాన్నే నమ్ముకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేదు.
హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి…ఇక్కడ బీజేపీకి పెద్దగా ఓట్లు పడలేదు. గత 2018 ఎన్నికల్లో సైతం ఇక్కడ టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే పోరు నడిచింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి, దాదాపు 43 వేల ఓట్ల పైనే మెజారిటీతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిపై గెలిచారు. ఇక ఇక్కడ బీజేపీకి నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
నోటాకు 2867 ఓట్లు పడితే, బీజేపీ అభ్యర్ధికి 1683 ఓట్లు పడ్డాయి. ఇక దీని బట్టే చూసుకోవచ్చు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఎంత బలం ఉందో. కాబట్టి ఈటల రాజేందర్ బీజేపీ బలాన్ని నమ్ముకోకుండా, సొంత బలాన్ని నమ్ముకుంటే టీఆర్ఎస్‌కు చెక్ పెట్టగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్ధిని పెడితే ఈటల రాజేందర్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. అలాగే ఇక్కడ కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీల్చి, ఎవరికి డ్యామేజ్ చేస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి హుజూరాబాద్ ఉప పోరులో ఎవరిది పైచేయి అవుతుందో?