తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. గురుకుల విద్యార్థిని మృతి నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు.తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికం,ఇది మీడియా స్వేచ్చను హరించడమే.
వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే.ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతున్నది. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా పై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి..?’ అంటూ హరీశ్ రావు మండిపడ్డారు.