సమయం లేకపోవడంతో తాను హై కోర్టుకు వెళ్లలేకపోతున్నాను అని కూడా చెప్పారు. తరువాత హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇదంతా రాజకీయంగా పెను దుమారం రేపింది. ఆ తరువాత ఓ సందర్భంలో కేఏ పాల్ మాట్లాడుతూ ఉండగా టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆయన చెంప చెళ్లుమనిపించారు.
ఈ ఘటన కూడా బాగా వైరల్ అయింది. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం తగదని పలువురు హితవు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి నిన్నమొన్నటి ఘటనలతో పాటు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు అన్నింటినీ వివరించారు కేఏ పాల్. అదేవిధంగా ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న అప్పులు వాటి వ్యవహారాలపై కూడా కేఏపాల్ కంప్లైంట్ చేశారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జగన్ వర్గాలనూ కలవర పాటుకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అప్పులు తారా స్థాయికి చేరుకున్నాయని ఇప్పటికే కేంద్రం నెత్తీ నోరూ మొత్తకుంటున్న తరుణంలో ఆ వాదనకు మద్దతు ఇచ్చే విధంగా కేఏ పాల్ ఫిర్యాదు ఉండడంతో ఇప్పుడిక రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.