బెజవాడ కార్పోరేషన్ లో అధికారులకు షాకిస్తున్న వైసీపీ అభ్యర్ధులు

-

బెజవాడ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ వైసీపీ నుంచి స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులతో అధికారులకు వింత అనుభవం ఎదురవుతోందట. ఎన్నికలకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ ఇవ్వటంతో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడే అసలు చిక్కోచ్చి పడిందట బెజవాడ కార్పొరేషన్ అధికారులకు…

బెజవాడ కార్పొరేషన్ పరిధిలో ఇంకా ఎన్నికలు జరగలేదు. కార్పొరేటర్లుగా ఎవరూ గెలవలేదు. కానీ అధికారులు మాత్రం ఒత్తిడికి గురవుతున్నారట. దీనికి ప్రధాన కారణంగా వైసీపీ నుంచి బరిలోకి దిగిన కార్పొరేటర్ అభ్యర్థులేనట. బెజవాడ కార్పొరేషన్ పరిధిలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 64 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీకి దిగిన కార్పొరేటర్ అభ్యర్థులు కార్పోరేషన్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బందిపై ఓవర్ యాక్షన్ చేస్తున్నారట. కార్పొరేషన్ కు ఎన్నికల జరగముందే అభ్యర్థులుగా ఉన్న వీరంతా తమను తాము కార్పొరేటర్లుగా భావించి అధికారులకు ఫోన్లు చేసి ఆ పని చేయలేదేంటి, ఈ పని చేయలేదేంటని ఇబ్బంది పెడుతున్నారట.

ప్రధానంగా పారిశుద్ధ్య సిబ్బంది, పారిశుద్ధ్య అధికారులకు ఉదయాన్నే ఫోన్లు చేసి ఇక్కడకు రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారట కొందరు అభ్యర్థులు. ఇక మరికొందరు అభ్యర్థులు మరింత అత్యుత్సాహంతో డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అంటే సీసీ రోడ్ల శంకుస్థాపన, అమ్మ ఒడి, ఇళ్ళపట్టాలు ఇలా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నీ తానై అన్నట్టు వ్యవహరిస్తూ డివిజన్ స్థాయి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారట. ప్రతిరోజూ వీరు డివిజన్లలో పర్యటిస్తూ అధికారులను కూడా తమతోపాటు తిరిగాలని ఒత్తడి చేస్తూ పెత్తనం చేస్తున్నారట అభ్యర్థులు. ఇక అక్రమ నిర్మాణాల విషయంలో కూడా కొందరు అభ్యర్థులు అప్పుడే తలదూరుస్తున్నారట. తమ తమ డివిజన్లలో అక్రమ నిర్మాణాల్లో వీళ్ళు కూడా తలా పాపం తిలా పిడెకెడు అన్నట్టు వ్యవహరిస్తున్నారట.

విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఈ హడావిడి ఎక్కువగా ఉందని సమాచారం. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇలాకాగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థులు మరింత ముందుగు వేసి తమను అధికారులు పట్టించుకోవటంలేదంటూ మంత్రికి సైతం ఫిర్యాదు చేశారట. అభ్యర్థులు అందరూ మీటింగ్ పెట్టుకుని మరీ తమ గోడు వెళ్ళబోసుకున్నారట. డివిజన్లలో పర్యటిస్తున్నామని, అధికార పార్టీకి చెందిన వారిమని అయినా తాము చెప్పినా మున్సిపల్ సిబ్బంది పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.ఇక వీరి దూకుడు చూసిన కార్పొరేషన్ సిబ్బంది గెలవక ముందే వీరి పెత్తనం ఏంటో అంటూ తలపట్టుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version