పసుపు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పంది. వారం, పది రోజులుగా మార్కెట్‌లో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850 చొప్పున రైతులకు చెల్లించేలా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 60,812 ఎకరాల్లో పసుపు సాగు చేయగా 1,89,628 టన్నులు దిగుబడి వచ్చినట్టు అంచనా. గతేడాది మార్కెట్‌లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.7,900కు పైగా ధర పలకగా, ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ వరకు క్వింటాల్‌కు రూ.7,500 వరకు పైగా పలికింది.
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పంట రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి మన పంటకు డిమాండ్ లేకపోవడం, ఎగుమతులు క్షీణించడం వంటి కారణాల వల్ల పసుపు ధర పతనమవుతూ వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు ఈ ఏడాది 20% తగ్గడంతో ప్రస్తుతం క్వాలిటీని బట్టి క్వింటాల్ రూ.5,500 నుంచి రూ.6 వేలకు మించి ధర పలకడం లేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,850కు కొనుగోలు చేయాలని సంకల్పించింది జగన్ సర్కార్.