ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించిన వైసీపీ ఒక్క ఓటమి మాత్రం కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. కృష్ణాజిల్లాలోని మెజారిటీ పంచాయతీల్లో వైసీపీ పాగా వేసినా ఆ ఒక్క పంచాయతీ మాత్రం అధికార పార్టీని ఇరుకున పెట్టింది. అది కాస్త మంత్రి సొంత గ్రామం కావడంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది..
కృష్ణా జిల్లా పల్లెపోరులో యలమర్రు పంచాయతీ ఈ గ్రామీణ ప్రాంతమే సెంటర్‌గా మారింది. ఈ ఊరు మంత్రి కొడాలి నాని పూర్వీకుల గ్రామం కావడం ఒకటైతే.. పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలుపొందడం మరో కారణం. అయితే యలమర్రు పంచాయతీ నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లేదు. పక్కనే ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఉంది. అయినా మంత్రి కొడాలి ఊరులో వైసీపీ ఓటమి అన్న ప్రచారం హాట్ టాపిక్ అయింది.
కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో 149 చోట్ల వైసీపీ గెలిస్తే.. టీడీపీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. గుడివాడలో 58 పంచాయతీలుంటే.. వైసీపీ 40 చోట్లా జెండా ఎగరేసింది. 14చోట్ల టీడీపీ గెలిచింది. ఇక్కడే టీడీపీ శ్రేణులు చేసిన ప్రచారం.. సోషల్ మీడియా వేదికగా హోరెత్తిన పోస్టింగ్‌లు కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. గుడివాడలో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిన విషయాన్ని పక్కన పెట్టేసి.. కొడాలి నాని పూర్వీకుల ఊరు యలమర్రులో టీడీపీ గెలిచిందన్న చర్చ అధికార పార్టీని ఇరుకున పడేసింది.
కొడాలి నాని స్వస్థలం గుడివాడ. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోంది కూడా గుడివాడే. యలమర్రు నాని అమ్మగారి ఊరు. అత్తగారు అక్కడి వారే. తమ పూర్వీకుల ఊరుగా నాని సైతం ఒప్పుకొన్నారు. అయితే యలమర్రు తన నియోజకవర్గంలో లేకపోవడంతో అక్కడ రాజకీయాలు చేయలేదని.. ఆ పంచాయతీలో గెలుపోటములతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు కొడాలి. అయినప్పటికీ టీడీపీ ప్రచారం ముందు మంత్రి ప్రకటన తేలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కేవలం మంత్రి కొడాలే కాకుండా.. పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఇతర వైసీపీ పెద్దలు ఈ అంశంపై స్పందించారు. యలమర్రు విషయంలో మంత్రికి సంబంధం లేకపోయినా కావాలనే ఆయన్ని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. కానీ.. ఎవరెన్ని చెప్పినా.. వైసీపీ నేతలు ఎంత గొంతు చించుకున్నా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని అధికార పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయట. దిక్కు తోచక నాయకులు సైతం తలపట్టుకుంటున్నట్టు సమాచారం.
పామర్రులో ఎన్నికలు జరిగిన 43 పంచాయతీలలో 27చోట్ల వైసీపీ గెలిచినా ఆ సంతోషాన్ని యలమర్రు ఆవిరి చేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. పామర్రు పరిధిలో ఎన్టీఆర్ అత్తగారి ఊరైన కొమరవోలు ఉంది. ఈ ఊరిని చంద్రబాబ సతీమణి నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు కూడా. అలాంటి కొమరవోలును సైతం వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. యలమర్రుపై టీడీపీ చేసిన ప్రచారం ముందు కొమరవోలులో వైసీపీ విజయం మరుగున పడిపోయింది. దీంతో యలమర్రులో ఎందుకు గెలవలేకపోయామా అని వైసీపీ నేతలు సైతం పునరాలోచనలో పడడ్డారట.
ఒక పంచాయతీ ఓటమి గురించి మంత్రి, పార్టీ పెద్దలు.. ఇంత మంది ఎమ్మెల్యేలు రియాక్ట్ కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదట. దీంతో ఎన్నికలు జరిగే ఎమ్మెల్యేల సొంత ఊళ్లల్లో స్పెషల్ ఫోకస్ పెట్టారట నాయకులు.