చాలామందికి తలనొప్పి, ఒత్తిడి, ఏదో తెలియని భయం, మానసిక ప్రశాంతత లేకపోవడం, దిగులుగా అనిపించడం అప్పుడప్పుడు జరుగుతుంది. సడన్‌గా లైఫ్ బోర్ కొడుతుంది. ఇంతేనా ఇక లైఫ్ అంటే అని విసుగు వస్తుంది. నిజానికి ఇలా రావాడానికి పెద్దగా కారణాలు ఏం ఉండకపోవచ్చు.. కానీ ఇవి మన కెరీర్, ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే.. బయటకు వెళ్లాలి..ఎంజాయ్ చేయాలి. అలానే ఉండిపోవద్దు. ఇంకోటి ఇప్పుడు చెప్పుకోబోయే వ్యాయామం. ఇది శరీరంలో అనేక సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. మానసిక ఆందోళనకు మెడిసన్‌లా పనిచేస్తుందట..
ఎలా చేయాలి…
కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ చేతులను పైకి లేపండి. శ్వాస వదులుతూ ముందుకు వంగి తలను కాళ్ల మీద ఆనించి చేతులతో పాదాలను పట్టుకోండి.. కష్టమనిపిస్తే వెన్నును వంచగలిగినంత వరకు మాత్రమే వంచండి. కొన్ని రోజుల తర్వాత పొట్ట, ఉదర భాగం కాళ్లకు తాకేలా వంగుతుంది. కిందికి వంగినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని 20 లేదా 30 సెకన్లు ఆపి ఉంచాలి. మెల్లగా శ్వాస వదులుతూ తలను పైకి లేపాలి. ఇలా మూడు సార్లు చేయండి. అన్ని ఆసనాల్లాగే ఇది కూడా ఖాళీ కడుపుతో చేయాలి. లేదా మూడు గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు చేయొచ్చు.
ప్రయోజనాలేంటి..?
ఈ ఆసనంతో వెన్నెముక, భుజాలు, పొత్తికడుపు, తొడ భాగాలు బలం పుంజుకుంటాయి. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఊబకాయం తగ్గుతుంది. తలనొప్పి, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. నెలసరిలో సమస్యలు కూడా తగ్గుతాయి. నిద్రలేమికీ ఇది మంచి ఆసనం అని నిపుణులు అంటున్నారు.
వీళ్లు చేయొద్దు..
ఉబ్బసంతో బాధపడుతున్న వారు ఈ ఆసనం చేయకూడదు.
ఏదైనా అనారోగ్యం ఉన్న రోజుల్లో చేయకూడదు.
వెన్ను సంబంధ సమస్యలున్న వారు యోగా శిక్షకుల నేతృత్వంలోనే చేయాలి.
సో..రోజూ ఉదయం ఈ ఆసనం వేసేందుకు ప్రయత్నించండి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. మార్పు మీరే గమనిస్తారు.