హనీ ట్రాప్ లో పడి ఓ యువకుడు కిడ్నాప్ డ్రామా తన తండ్రినే డబ్బులు చేశాడు. అమ్మాయి ట్రాప్‌లో పడి ఆపై బ్లాక్‌మెయిల్‌కు గురైన ఓ అబ్బాయి తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన జ్యోతిష్ తివారీ కుమారుడు అభిషేక్ తివారీ శివకుటి ప్రాంతంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అబ్బాయి నంబరు తీసుకున్న ఆమె ఓ రోజు వీడియో కాల్ చేసి నగ్నంగా మాట్లాడింది. అది చూసి భయపడిన అభిషేక్ వెంటనే ఆ కాల్ కట్ చేశాడు. అయితే, అప్పటికే ఆ కాల్‌ను రికార్డు చేసిన బ్లాక్‌మెయిలర్ ఆ వీడియోను చూపించి డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెట్టాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు.
దీంతో భయపడిపోయిన అభిషేక్ తొలుత రూ. 30 వేలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ బెదిరింపులు ఆగకపోవడంతో కొందరితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. శుక్రవారం తండ్రికి ఫోన్ చేసి తనను కొందరు వ్యక్తులు ఫోన్ చేసి నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారని చెప్పాడు. ఆ తర్వాత జ్యోతిష్ తివారీకి ఓ ఫోన్ వచ్చింది. అభిషేక్‌ను కిడ్నాప్ చేశామని, రూ. 2 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అభిషేక్ ఫోన్ నంబరును ట్రేస్ చేసి పట్టుకుని ప్రశ్నించారు. అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు. బ్లాక్‌మెయిలర్‌కు డబ్బులు ఇచ్చేందుకే కిడ్నాప్ డ్రామా ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిలర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.