టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఒకవైపు ఆలోచిస్తుంటే.. ప్రభుత్వాధినేత, వైసీపీ నాయకుడు అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారా ? అనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం జగన్‌ను తెలివి లేనివాడి కింద, పాలన చేతకాని నాయకుడి కింద చిత్రీకరించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. అయితే, దీనికి విరుద్ధంగా జగన్ మాత్రం తనలోని నాయకత్వ పటిమకు మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి చెక్ పెడుతున్నారు. ఇప్పటికే జగన్ తీసుకున్న నిర్ణయాలు టీడీపీ ఓటు బ్యాంకును తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుంటే, ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టిన జగన్.. వచ్చే ఎన్నికల్లో బాబును ఓడించాలనే కృత నిశ్చయంతో పని చేసుకుంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లోనే చంద్రబాబును ఓడించాలని అనుకున్నారు. అయితే, ఇది సాధ్యం కానప్పటికీ.. దాదాపు 10 వేల మెజారిటీ ఓట్లను మాత్రం తగ్గించగలిగారు. ఇక, ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్లి.. బాబు సొంత నియోజకవర్గం కుప్పంపై తన దైన ముద్ర వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని పేదలకు కుప్పం నియోజకవర్గంలో ఇళ్లు ఇచ్చేందుకు ఇప్పటికే సంసిద్ధులైన జగన్.. దీనికి సంబంధించి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సాధించి తీరాలని నిర్ణయించారు. ఫలితంగా బాబు ఓటు బ్యాంకు తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో తాజాగా కుప్పంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ది చేయాలని తాజాగా కేబినెట్‌లో నిర్ణయించారు. ఈ బాధ్యతలను చంద్రగిరి ఎమ్మెల్యే, విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జగన్ అప్పగించారని ప్రచారం సాగుతోంది. ప్రతిగ్రామంలోనూ విద్యుత్తు, తాగునీరు, రోడ్లు ఏర్పాటు చేయాలని, అదేసమయంలో కోరిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించినట్టు తెలుస్తోంది.
తద్వారా కుప్పం నియోజకవర్గంపై జగన్ తనదైన శైలిలో ముద్ర వేయాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించింది లేదు. ఈ విషయాన్ని కూడా పెద్దగా ప్రచారం చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే.. ఆపరేషన్ కుప్పం.. చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
-vuyyuru subhash