ఏపీలో ఎప్పుడు జగన్ ప్రభుత్వం ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో..ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు ఒకో సారి మేలు జరుగుతుంటే…మరొకసారి నష్టం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కూడా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అసలు దీని వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందో…లాభం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. ప్రభుత్వం ఏమో దీని వల్ల లాభమే ఉంటుందని, కాదు దీని వల్ల తమకు ఇబ్బందని కొంతమంది ప్రజలు బయటకొచ్చి చెప్పే పరిస్తితి. అటు ప్రతిపక్షాలు కూడా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
అసలు ఇలా వివాదంగా మారిన ఈ స్కీమ్ ఏంటి? అంటే…1983 నుంచి 2018 వరకు ఏపీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి ప్రజలకు…ఆయా ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఇప్పుడు రూ.10 వేలు, రూ.20 వేలు చెల్లిస్తే సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. అసలు ఆ అవసరం కూడా రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో లక్షల మంది ప్రభుత్వ స్కీమ్‌తో పాటు సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టుకుని ఇళ్ళు కట్టుకున్నారు. అసలు ఆ ఇళ్ళు వారివే…వాటిపై ఎప్పుడు ఎలాంటి వివాదాలు రాలేదు.
అలాంటిది ఇప్పుడు…జగన్ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పేరిట గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు చెల్లిస్తే..ఆ ఇళ్లని లబ్దిదారుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి సంపూర్ణ హక్కులు కల్పిస్తామని చెబుతోంది. అదేంటి ఎప్పుడో కట్టుకున్న తమ ఇళ్లకు ఇప్పుడు డబ్బులు చెల్లించడం ఏంటని? పేదలు ఎదురు తిరిగే పరిస్తితి వచ్చింది. అయితే ఎదురు తిరుగుతున్న వారికి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం హెచ్చరికలు పంపుతుంది…ఓటీఎస్ చేయకపోతే పెన్షన్లు, ఇతర స్కీమ్‌లు ఆపేస్తామని చెప్పిస్తున్నారు. అసలే కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలని…ఓటీఎస్ పేరిట ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియడం లేదు. పోనీ ఉచితంగా స్కీమ్ అమలు చేసిన బాగానే ఉండేది. డబ్బులు కట్టాలని చెప్పడంతోనే ఇబ్బంది అవుతుంది.