మొత్తానికి వైసీపీ ట్రాప్‌లో తెలుగు తమ్ముళ్ళు పడినట్లే కనిపిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం వల్ల వైసీపీలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో తెలియదు గాని..టీడీపీలో మాత్రం పెద్ద రచ్చ నడుస్తోంది. పైగా ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అన్నట్లు వార్ నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చడంపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదే క్రమంలో ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఖండిస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ ఆయన పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ గౌరవం తగ్గించలేరని ఓ ట్వీట్ పెట్టి..కర్రా విరగకూడదు..పాము చావు కూడదు అన్నట్లు మాట్లాడేశారు. అంటే టీడీపీకి మద్ధతు పలకలేదు..అలా అని వైసీపీని విమర్శించలేదు. ఇలా ఎన్టీఆర్ స్పందించడంపై కొందరు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అసలు ఇలా ట్వీట్ పెట్టే బదులు..ట్వీట్ పెట్టకుండా ఉండాల్సిందని ఫైర్ అవుతున్నారు. అయినా తమకు ఎన్టీఆర్ అవసరం లేదని..తమకు లోకేష్ ఉన్నారని పోస్టులు పెడుతున్నారు.
అటు కొందరు ఎన్టీఆర్ మద్ధతుదారుల తీరు వేరుగా ఉంది..ఎన్టీఆర్ చాలా హుందాగా ప్రవర్తించారని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్‌ని విమర్శిస్తున్న వారిపై..వీరు కూడా ఫైర్ అవుతున్నారు. అంటే టీడీపీలోనే రెండు గ్రూపులు తయారయ్యి..సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అన్నట్లు రాజకీయం నడిపిస్తున్నారు. అంటే ఒక్క పేరు మార్పు టీడీపీలో చిచ్చుకు కారణమైంది. కానీ ఇదంతా వైసీపీ ఆడుతున్న గేమ్ అని అందులో కార్యకర్తలు పడుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
ఇక మధ్యస్థంగా ఉన్న కొందరు కార్యకర్తలు…ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఒకరు ఎన్టీఆర్ అని, మరొకరు లోకేశ్ అని తిట్టుకోవద్దు అని ఇది వైసీపీ వేసిన ట్రాప్ అని, ఆ ట్రాప్ లో పడొద్దని కోరుతున్నారు. కానీ తమ్ముళ్ళు తగ్గట్లేదు. తమదైన శైలిలో విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. మొత్తానికి వైసీపీ..టీడీపీని గట్టిగానే బుక్ చేసింది.