మంత్రులు రెచ్చగొడుతున్నారు..కేసీఆర్ కంట్రోల్ చేయాలి : వైసీపీ ఎమ్మెల్సీ

కడప జిల్లా ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సున్నితమైన అంశమని.. దీన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేటాయించిన జలాలనే వాడుకుంటున్నామని..అంతకు మించి వాడుకోలేదు…కొత్త ప్రాజెక్టును నిర్మించడం లేదన్నారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని.. మంత్రులను కేసీఆర్ కంట్రోల్ చేయాలని వార్నింగ్‌ ఇచ్చారు. వైఎస్సార్ ను నిందిస్తూ ఆరోపణలు చేయడం దారుణం…దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి, పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రాంతం చూడకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించిన ఘనత వైఎస్ ది అని… వైఎస్ పై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు ఆయన చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.. రాయలసీమలో ప్రతి జిల్లాకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దీని వల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టం లేదని… కేటాయించిన వాటిలోనే నీటిని వాడుకుంటున్నామని స్పష్టం చేశారు.