అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు

-

అమ్మ రాజ్యంలో కడప బిడ్డ‌లు విజయం సాధించారు. రాష్ట్ర‌మంత‌టా కమ్మ సామాజికవర్గ ప్రజలు ఉన్న‌ప్ప‌టికీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కవ సంఖ్యలో నివసిస్తుంటారని తెలిసిన విష‌య‌మే. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాపకులు నంద‌మూరి తార‌క‌రామారావుది ఇదే సామాజిక‌వ‌ర్గం కావ‌డంతో మొదటినుంచి ఈ సామాజికవర్గం టీడీపీకి మద్దతుగా ఉంటూ వచ్చింది. కాబ‌ట్టి ఈ మూడుజిల్లాల్లో టీడీపీకి బాగా ప‌ట్టుంటుంద‌ని అంద‌రి భావ‌న‌. తాజాగా వెలువ‌డ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించ‌లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ రాజ‌కీయాల‌పై తీసిన చిత్రానికి క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అని పేరు పెట్టారు. త‌ర్వాత అది వివాదాల‌కు దారితీయ‌డంతో అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లుగా పేరు మార్చారు.

 

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు 64 డివిజ‌న్లు ఉండ‌గా 26 డివిజ‌న్ల‌లో వైసీపీ, 12 డివిజ‌న్ల‌లో తెలుగుదేశం ముందంజ‌లో ఉన్నాయి. మచిలీప‌ట్నంలో వైసీపీ 14, తెలుగుదేశం 2, జ‌న‌సేన ఒక డివిజ‌న్‌ను గెలుచుకున్నాయి. ఉయ్యూరు, నందిగామ‌, పెడ‌న‌. నూజివీడు, తిరువూరు పుర‌పాల‌క సంఘాల‌న్నింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది.

గుంటూరు జిల్లా‌

ఏపీలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్ర‌త్య‌ర్థుల‌ను ఫ్యానుగాలికి కొట్టుకుపోయేలా చేసింది. గుంటూరు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలో ఎన్నికలు జరిగిన రేపల్లె, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట పుర‌పాల‌క సంఘాల‌ను తిరుగులేని ఆధిక్యతతో కైవసం చేసుకుంది. గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 57 డివిజన్లకుగాను ఎన్నికలకు ముందు ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 56 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 43 డివిజన్లు, తెలుగుదేశం 9 డివిజన్లు, జనసేన రెండు డివిజన్లు, ఇతరులు రెండు డివిజన్లలో గెలుపొందారు.

ప్ర‌కాశం జిల్లా

ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరిగిన ఒంగోలు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, పురపాలక సంఘాలు, నగర పంచాయితీలన్నింటినీ వైసీపీ తన సొంతం చేసుకుంది. ఒంగోలులో మొత్తం 50 డివిజ‌న్ల‌కుగాను వైసీపీ 41 డివిజ‌న్ల‌ను గెలుచుకోగా తెలుగుదేశం 6, జ‌న‌సేన 1, ఇత‌రులు 2 డివిజ‌న్ల‌లో గెలిచి ప‌రువు నిల‌బెట్టుకున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, చీరాల అన్నింటినీ అధికారపార్టీ తన హస్తగతం చేసుకోగలిగింది. చీరాలలో టీడీపీక‌న్నా ఎమ్మెల్యే బ‌ల‌రాంకు వ్య‌తిరేకంగా మొహ‌రించిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ‌ర్గీయులు 14 డివిజ‌న్లను గెలుచుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు 18 డివిజ‌న్లు వ‌చ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news