తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొరడా ఝళిపిస్తోంది. అధికారులకు జైలు శిక్షలు విధిస్తూ సంచలన తీర్పులు వెల్లడిస్తోంది హై కోర్టు.అయితే తాజాగా మరో ముగ్గురు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది హై కోర్టు. వీరిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ మాజీ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ ఉన్నారు.
నిన్న జరిగిన విచారణకు అరుణ్ కుమార్, వీరపాండియన్ హాజరయ్యారు. వీరిద్దరి అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేసేందుకు నిరాకరించిన హై కోర్టు.. ఈ నెల 13వ తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) ఎదుట లొంగిపోవాలని ఆమెను ఆదేశించారు.
అయితే, సింగిల్ జడ్జి తీర్పుపై పూనం మాలకొండయ్య నిన్ననే అత్యవసరంగా ధర్మాసనం ఎదుట అప్పీల్ చేయగా విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. కాగా, కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన ఎన్. మదనసుందర్ గౌడ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని, రెండు వారాల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలంటూ 22 అక్టోబరు 2019న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.