ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగాలి..? దాని వలన లాభం ఎవరికి..?

-

ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వర్గీకరణ కోసం మాదిగలు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు. దీని కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మొత్తానికి వారి పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. వర్గీకరణ చేసుకోవచ్చని చెప్తూ భారత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు పోరాటాలు చేసిన మాదిగ సంఘాల నేతలు సంతోష పడుతున్నారు. వర్గీకరణకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి..? దీని వలన ఎవరికి లాభం..? వర్గీకరణతో మాదిగలకు న్యాయం జరుగుతుందా…? ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం…

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువ. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల వాళ్లే 80 శాతం వరకూ ఉంటారని అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. ఎస్సీల్లో కూడా ఎక్కువ, తక్కువలున్నాయి.

కాగా.. ఎస్సీ జనాభాలో మాలల కన్న మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందని కొందరు మేధావులు వాదిస్తున్నారు.70 శాతం ఉన్న మాదిగలు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే, 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం అందుతున్నాయని వారు తరతరాలుగా ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

అందుకే మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు మొదలయ్యాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించింది. మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం సాగింది. 1994లో మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు. పాదయాత్ర ద్వారా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా గురించి చైతన్య పరిచారు. ఎస్సీ కులాలను A,B ,C,D గ్రూపులుగా విభజించి కులాల నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల మాదిరిగానే మాదిగలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ 1972 నుంచి ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించారు. ఎస్సీ వర్గీకరణతోనే న్యాయం జరుగుతుందని తెలియజెప్పారు.దీనిపై ఎవ్వరూ ముందుకు రాలేదు.

ఉమ్మడి ఏపీలో 2000-2004 చంద్రబాబు సర్కార్ నడుస్తున్న టైములో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. కానీ మాలమహనాడు వర్గీకరణను వ్యతిరేకించి హైకోర్టులో న్యాయపోరాటానికి దిగింది.దీంతో వర్గీకరణకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. 2004 లో సుప్రీంకోర్టులో కూడా ఐదుగురు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది.ఇక అప్పటినుంచి వర్గీకరణ ఉద్యమం ప్రజాపోరాటంగాను క్రమంగా రాజకీయ ఉద్యమాలుగానూ మారిపోయాయి.

అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని చెప్పిన ధర్మాసనం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. మాదిగలు చేస్తున్న పోరాటానికి సుప్రీం తీర్పుతో తెరపడింది.

మొన్నటి ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మద్దతు పలికారు. పైగా ఉద్యమ నేత మందా కృష్ణ మాదిగను తన సోదరుడిగా బహిరంగ సభలో చెప్పుకున్నారు. అప్పుడే వర్గీకరణకు బీజం పడిందనే వార్తలు వచ్చాయి. ఈ వర్గీకరణతో బీజేపీకి తెలంగాణలో బాగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. 1999లో మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందిస్తూ చంద్రబాబు రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు అదేవిధంగా బీజేపీకి కూడా ఈ వర్గీకరణ కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు .

వర్గీకరణకు వ్యతిరేకించడంతో పాటు మాలలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తోచ్చు. వర్గీకరణకు చంద్రబాబు సపోర్ట్ మరచిపోలేనిదని మంద కృష్ణ మాదిగ ప్రకటించడంతో ఏపీలో మాలల నుంచి టీడీపీకి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే వర్గీకరణపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వర్గీకరణ అంశంపై ఇప్పటికే మాలలు ఉద్యమానికి సిద్ధం అని ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ స్థాయిలో మాలలు కూడా పోరాటాలు మొదలుపెడితే రాజకీయ పార్టీలకు సంకట పరిస్థితులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version