2021 రౌండప్: ఎన్నికల్లో గెలుపోటములు.. మారిన రాజకీయం తీరు

2021లో జరిగిన ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితికి మోదాన్నిఖేదాన్ని మిగిల్చాయి. ఎన్నికలు జరిగిన ఒక స్థానాన్ని నిలబెట్టుకోగా మరో స్థానంలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో ప్రారంభించిన అధికార పార్టీ ఆఖరులో మాత్రం ఘోర ఓటమితో కంగుతిన్నది. అయితే, పట్టభద్రు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం, స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలువడం ఊరట కలిగించే అంశాలు. హుజూరాబాద్‌లో గెలుపు బీజేపీలో కొత్త జోష్ నింపింది. మరోవైపు కొత్త నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికలో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ జానారెడ్డి‌పై భారీ విజయం సాధించాడు. ఇదీ అధికార పార్టీ విజయపరంపరకు చిహ్నంగా నిలిచింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను తొలిసారి టీఆర్‌ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. రాష్ట్రంలో దూకుడు పెంచాలని భావిస్తున్న బీజేపీకి కల్లెం వేయాలని భావించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో సిట్టింగ్ స్థానంలో బీజేపీని ఓడించడంతోపాటు ఖమ్మం స్థానాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించింది. బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావుకు దీటైన అభ్యర్థిగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కూతురును బరిలోకి దింపింది. సర్వశక్తులు ఒడ్డి బీజేపీని ఓడించింది. మరో వైపు ఖమ్మంలో తన అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా ప్రొఫెసర్ కోదండరాం, తీర్మార్ మల్లన్నలను నిలువరించగలిగింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ను ఇచ్చింది. భూ కుంభకోణం ఆరోపణలతో సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అనంతర పరిణామాలతో టీఆర్‌ఎస్‌‌కూ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికను గులాబీ బాస్ కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈటలను అసెంబ్లీలో చూడకూడదనుకున్నారు. సర్వశక్తుల ఒడ్డారు. కొత్త పథకాలను ప్రవేశ పెట్టారు. ‘అవసరమైన’ అన్ని పనులూ చేశారు. కానీ, ఆశించిన ఫలితం దక్కకపోగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దాదాపు 23,855 ఓట్లతో విజయం కేతనం ఎగుర వేశారు. ఒక ఉప ఎన్నికలో భారీ స్థాయి తేడాతో ఓటమి పాలు కావడం టీఆర్‌ఎస్‌కు ఇదే తొలిసారి.

స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ ఫలితంతో గులాబీ బాస్ ఎలాంటి ఛాయిస్ తీసుకోకూడదని భావించి ఆచితూచి అడుగులు వేశారు. ఆరు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. మరో ఆరింటిలో క్యాంపులు నిర్వహించి ఫలితంలో ఎక్కడా తేడా రాకుండా టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకున్నారు.

ఏడాది కాలంలో జరిగిన ఎన్నికలు మొత్తం మీద రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మార్చివేశాయి. మరో బలమైన ప్రత్యర్థి రూపంలో బీజేపీ ముందుకు రావడం, కాంగ్రెస్‌లో కొత్త నాయకత్వం వెరసి తెలంగాణ రాజకీయాలను హీట్టెక్కించాయి. హుజూరాబాద్ ఫలితంతో బీజేపీ దూకుడు పెంచగా, టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ఏది ఏమైనా వచ్చే ఏడాది మాత్రం రాష్ట్ర రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతాయనడంలో సందేహం లేదు.