హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో హైదరాబాద్ తో పాటూ తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి జనాలు క్యూ కట్టారు. వేలాదిమంది సొంత రాష్ట్రానికి బయల్దేరారు.. దీంతో ఏపీ సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారంతా నిబంధనలు పాటించాల్సిందే అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరోక్షంగా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ పొందాలని అన్నారు. పాస్ ఉన్న వారిని సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. పాస్ లు ఉన్నా కూడా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి కొనసాగుతుందని తెలిపారు.