రాష్ట్రంలో కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షలపైగా టెస్టులు చేస్తే తెలంగాణలో లక్ష మాత్రమే జరిగాయని, ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచకుండా వైరస్ వ్యాప్తికి పెరగడానికి కేసీఆర్ కారణమయ్యారని కోమటిరెడ్డి ఆరోపించారు. అలాగే, ప్రగతిభవన్ లో కేసులు రావడంతో.. కేసీఆర్ ఫాంహౌస్‌కు పారిపోయారని ఆయన మండిపడ్డారు.
పైన భగవంతుడు అన్నీ చూస్తుంటాడని, కేసీఆర్ ఫాంహౌస్ కు కూడా కరోనా వస్తుందని, ఇది తన శాపం అని అన్నారు. ప్రజలను పాలించడానికి సీఎం అయ్యారా లేక చంపడానికి సీఎం అయ్యారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయకుండా టెస్టుల సంఖ్య పెంచాలని, మెరుగైన వైద్యం అందించాలని, లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని కేసీఆర్‌ను హెచ్చరించారు. కరోనా సహాయ చర్యల కోసం వచ్చిన కోట్ల విరాళాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు.