కరోనా దేశంలోకి ఎంటర్ అయిన కొన్నాళ్ళకి భారత ప్రభుత్వం మేలుకొని దేశమంతటా లాక్ డౌన్ విధించింది. అయినా సరే దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ రోజులు లాక్ డౌన్ లోనే ఉంటే ఇబ్బంది అని భావించిన కేంద్రం దశల వారీగా లాక్ డౌన్ ని సడలిస్తూ వచ్చింది. సడలింపులు ఇచ్చిన కొద్దీ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఎక్కడిక్కడ లాక్ డౌన్ విధించుకునే అవకాశాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలని అప్పగించింది కేంద్రం. రాష్ట్రాలు ఏమో అక్కడి జిల్లా కలెక్టర్లకి అప్పగించింది.
దీంతో భారీగా కేసులు నమోదవుతున్న పట్టణాల్లో, నగరాల్లో, పల్లెల్లో సైతం లాక్ డౌన్ అమలు పరుస్తున్నారు అక్కడి కలెక్టర్లు. శ్రీకాకుళం పట్టణంలో కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా జూలై నెల పది నుండి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అప్పుడు పద్నాలుగు రోజులు అని అనౌన్స్ చేసినా కేసులు తగ్గకపోవడంతో మరో వారం పొడిగించారు. అయినా తగ్గడం లేదని భావించి ఇప్పుడు మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు పరచనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకూ నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది, మధ్యాహ్నం 1 గంట తర్వాత బయట ఎవరూ తిరగొద్దని ప్రజలకు జిల్లా కలెక్టర్ నివాస్ సూచించారు.