ఒకప్పుడు దొమ్మాట. ఇప్పుడు దుబ్బాక. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉన్న ప్రాంతం. కాలక్రమంలో ఇక్కడ టీఆర్‌ఎస్ పాగా వేసింది. మరి.. ఇప్పుడు జరిగే ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ ఆ పట్టు నిలుపుకొంటుందా? ప్రత్యర్థుల పోరాటానికి ప్రజల మద్దతు ఏ మేరకు ఉంటుంది?
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొమ్మాట.. 2009లో దుబ్బాకగా మారింది. దొమ్మాట నుంచి దుబ్బాక వరకూ ఉప ఎన్నికలతో కలిసి 15సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో చెరుకు ముత్యంరెడ్డి నాలుగుసార్లు, సోలిపేట రామలింగారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదుసార్లు కాంగ్రెస్ జెండా ఎగరేయగా.. టీడీపీకి, టీఆర్‌ఎస్‌కు చేరో నాలుగుసార్లు పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత 2009లో మాత్రమే టీఆర్‌ఎస్ ఇక్కడ ఓడిపోయింది. 2009లో మహకూటమి పొత్తులో భాగంగా ఈ సీటును టీఆర్‌ఎస్‌కు ఇచ్చింది టీడీపీ. అయితే అప్పటి వరకూ టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు.
2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డే గెలిచారు. 2018లో టీఆర్‌ఎస్‌కు 89వేల 299, కాంగ్రెస్‌కు 26వేల 799, బీజేపీకి 22వేల 595 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 62వేల 500 ఓట్ల మెజారిటీ సాధించింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 82 వేల 231, కాంగ్రెస్‌కు 44 వేల 306, బీజేపీకి 15 వేల 133 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఆధిక్యం 37వేల 925 ఓట్లు. 2014 ఫలితంతో పోల్చుకుంటే 2018 నాటికి టీఆర్‌ఎస్ మెజారిటీ భారీగా పెరిగింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
దుబ్బాకలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. వాటిలో ఐదు సిద్ధిపేట జిల్లా.. రెండు మెదక్ జిల్లా పరిధిలోకి వస్తాయి. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయిపోల్ ఉండగా.. మెదక్ జిల్లాలో నార్సింగ్, చేగుంట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో దుబ్బాక గ్రేడ్ 2 మున్సిపాలిటీ ఉంది. ఈ నియోజకవర్గం మొత్తంలో గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ.
దుబ్బాకలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేది బీసీ ఓటర్లే. వారిలో ముదిరాజ్ సామాజికవర్గం వారు అధికం. దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఒక లక్షా 98 వేల 807. వీరిలో మహిళలు ఒక లక్షా 779 మంది కాగా.. పురుషులు 98వేల 28 మంది. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే 8 వేల మంది ఓటర్లు పెరిగారు. వీరిలో అత్యధికులు యువకులే.
ఉప ఎన్నికలో ప్రతి ఓటూ కీలకమే. అందుకే ఈసారి వలస వెళ్లిన ఓటర్లను పోలింగ్ నాటికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి పార్టీలు. ఈసారి కరోనా బాధితులు, 80 ఏళ్ల పైబడ్డవారు, దివ్యాంగులకు ఇంటి దగ్గర పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. ఇలాంటి వారు ఒక వెయ్యి 558 మంది ఉన్నారు.
దుబ్బాకలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 315. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు అధికారులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా ఓటర్ల సంఖ్యను చూస్తే.. దుబ్బాక మండలంలో 55వేల 208 ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 27వేల 225, మహిళలు 27 వేల 983, ఈ మండలంలో 84 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మిరుదొడ్డి మండలంలో 31 వేల 762 మంది ఓటర్లు ఉండగా.. 40 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దౌల్తాబాద్ మండలంలో 23 వేల 32 ఓటర్లు ఉండగా. 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. చేగుంట మండలంలో 32 వేల 829 ఓటర్లు ఉండగా.. 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాయిపోల్ మండలంలో 20 వేల 513 ఓటర్లు ఉండగా..54 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నార్సింగ్ మండలంలో 8 వేల 215 ఓటర్లు ఉండగా 14 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గజ్వేల్ మండలంలోని ఆరేపల్లి గ్రామం కూడా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది.
నవంబర్ 3న ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది. నవంబర్ 10 ఫలితం వెల్లడిస్తారు. కోవిడ్ కారణంగా పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్ లేకుండా ఓటు వేయడానికి ఎవరినీ అనుమతించరు. గత ఎన్నికల్లో 86 శాతం పోలింగ్ నమోదైంది. దానిని ఇంకా పెంచాలని చూస్తున్నారు అధికారులు.