టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి జంపింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ విషయంలో నాయకులు మారిపోయారు. గడిచిన మూడు మాసాలుగా ఏ ఒక్కరూ పార్టీలు మారలేదు.. వైసీపీలోకి చేరలేదు. వస్తారని అనుకున్న కీలక నాయకుల ఊసు కూడాలేదు. మరి ఏం జరిగింది ? ఎందుకు జంపింగులు ఆగిపోయాయి ? అనే విషయం ఆసక్తిగా మారింది. దీనికి వైసీపీలోనే సీనియర్లు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి జగన్‌పై సొంత పార్టీలోనే నమ్మకం సన్నగిల్లడం.. ఇది పక్కపార్టీల నుంచి వచ్చే నాయకులను మరింతగా బెంబేలు పెట్టించడం.
ఇక, రెండో కారణం.. ఏక్కడికక్కడ వైసీపీలో తెరమీదికి వచ్చిన విభేదాలు, వివాదాలు. దీంతో ఇతర పార్టీల నుంచి రావాలని అనుకున్న నాయకులు కూడా వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు జగన్‌పై చాలానే అంచనాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబుకు భిన్నమైన పాలన అందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ఆశించిన విదంగా దూసుకుపోలేక పోతున్నారనే వాదన ఇటీవల కాలంలో బలపడుతోంది. పైగా బీజేపీ అధిష్టానానికి ఎక్కడో భయపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది తమకు ఇబ్బంది కలిగిస్తుందని అనుకునే నాయకులు పెరుగుతున్నారు.
మరోవైపు.. వైసీపీలోనే నాయకులు రోడ్డెక్కుతున్నారు. మంది ఎక్కువైతే.. మజ్జిగ పలచన అవుతుందన్న చందంగా.. నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడం..ఎక్కడికక్కడ నాయకులు ఆధిపత్య రాజకీయాలకు తెరదీయడం వంటివి పార్టీలో తీవ్ర వివాదాలకు కారణంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీలో ఉన్న నాయకులే కొట్టుకుంటుంటే.. మనం వెళ్లి ఏం చేస్తాం..? అని అనుకుంటున్న పరిస్థితి ఇతర పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితే ఇందుకు ఉదాహరణ. రాజోలు, గన్నవరం, చీరాల, విశాఖ దక్షిణం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలతో పాటు రామచంద్రాపురం లాంటి చోట్ల నేతల మధ్య పంచాయితీ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఉన్న గొడవలు చాలవన్నట్టుగా… కొత్త నేతలతో కొత్త పంచాయితీలు ఎందుకు రా బాబూ ? అన్న పరిస్థితి కూడా ఉంది. దీంతో వైసీపీలోకి జంపింగులు ఆగిపోయాయని అంటున్నారు. మున్ముందు కూడా అప్పటి పరిస్థితిని అంచనా వేసుకుని మాత్రమే నాయకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.