గుంటూరు జిల్లా గురజాల కేంద్రంగా అధికార ప్రతిపక్ష నేతలు తొడలు కొట్టి హెచ్చరికలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం దాచేపల్లిలో యరపతినేని నిర్వహించన సభతో సవాళ్ల పర్వం వేడెక్కింది. చాలా కాలం తరువాత టిడిపి ఆ స్థాయిలో సభ నిర్వహించుకోవడం పార్టీలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో అధకార పార్టీ నేతలు దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ సందర్బంగా భారీ ర్యాలీ తీసి దీటుగా సమాధానం ఇచ్చారు. దీంతో పల్నాడు రాజకీయం మళ్లీ రాజుకుంటోంది.
గురజాలలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలతో నేతలు భగభగ మండుతున్నారు. దాచేపల్లిలో టిడిపి నిర్వహించన సభ తరువాత ఈ వేడి మరింత పెరిగింది. నేతల సవాళ్లు, విమర్శలు సాధారణమే అయినప్పటికీ…కొత్త అంశాలు తెరపైకి రావడంతో రచ్చ ముదురుతోంది. ఇదే సమయంలో పల్నాడు జిల్లా అంటూ మరింత వేడెక్కిస్తున్నారు టిడిపి నేతలు. దీంతో అభివృద్ది మంత్రంతో కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు.
దాచేపల్లి సభలో యరపతినేని తొడ కొట్టి.. అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారని టిడిపి నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో అదే దాచేపల్లిలో సభ పెట్టి కౌంటరిచ్చారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. తొడలు కొడితే పిల్లలు కూడా భయటపడరంటూ… చిన్న పిల్లాడితో తొడ కొట్టించారు. ఇలా ఇరు వర్గాలు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టిడిపి ఇప్పుడు రోడ్డెక్కి సవాళ్లు విసురుతోంది. మరోవైపు అధికార పార్టీ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది.
అయితే ఈ సవాళ్ల పర్వం ఎటు పోతుందో అనే ఆందోళన కూడా స్థానికంగా వ్యక్తం అవుతోంది. నేతలు సవాళ్లు చేసుకుంటే గ్రామాల్లో కార్యకర్తలు దాడులు చేసుకునే అవకాశం ఉంది. దీంతో నేతలు సంయమనంతో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. అయినా ఈ ప్రాంతంలో తొడ కొట్టే రాజకీయం రంకెలు వేస్తోంది.