ఏ ఎన్నికల్లోనైనా ప్రత్యేక్షంగా కానీ.. పరోక్షంగా కానీ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ , ఎంఐఎం ఒకరికొకరు మద్దతిచ్చుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దత్విమని అన్న ఎంఐఎం చివరి క్షణాల్లో పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతిచ్చి మేయర్ సీటు దక్కేలా చేసింది. ప్రస్తుతం వాడివేడిగా మారుతున్న హైదరాబాద్– రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీర్ఎస్, బీజేపీతో పాటు పలు పార్టీలు సొంతంగా బరిలోకి దిగగా, మరికొందరు స్వతంత్రంగా పోటీకి దిగారు. ఈసారి ఎంఐఎం ఎవరికీ మద్దతిస్తోందని చర్చలు జరుగుతున్నాయి.
భారీగా మైనార్టీలు నమోదు..
హైదరాబాద్–రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానానికి 93 మంది బరిలో నిలువగా దాదాపుగా 5 లక్షలపై చిలుకు పట్టభద్రులు ఉన్నారు. ఈ సారి మైనార్టీలు సైతం భారీగా ఓట్లు నమోదు చేసుకున్నారు. మజ్లీస్ రంగంలో లేకపోయినా ఎవరికో ఒకరికి ఓటేయాల్సిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు మద్దతు, ఒప్పందాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు ఎంఐఎం అ«ధిష్ఠానం నుంచి మద్దతుపై అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆ ఓటర్లంతా అయోమయంలో పడ్డారు.
దోస్తీ ఉంటుందా..
రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయని స్థానల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం నిరంతరం శ్రమించి ఆయా స్థానాలను గెలిపించింది. మొన్న ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా.. చివరికి ఒకే కూటికి చేరి అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈసారీ మాత్రం దోస్తీ పార్టీకు ప్రత్యేక్షంగా అయినా పరోక్షంగానైనా మద్దతిచ్చేందుకు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పీవీ ఇంటి నుంచి కావడంతో..
టీఆర్ఎస్ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు బరిలో నిలిచిన సంగతి విదితమే. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతలో పీవీ హస్తం ఉందని నాటి నుంచే ఎంఐఎం ఆరోపిస్తూనే ఉంది. మైనార్టీల్లోనూ పీవీపై వ్యతిరేకత ఉంది. ఈ కారణంతో టీఆఆర్ఎస్ నుంచి బరిలో దిగిన పీవీ కూతురు సురభి వాణీదేవికి మద్దతిచ్చేందుకు వెనకడుగు వేస్తోందని తెలుస్తోంది.