దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు కరోనా బాధితులు తమ ఇమ్యూనిటీ పవర్‌ను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్స్, మసాల దినుసులు తదితర వాటిని కొనుగోలు చేస్తున్నారు. వీటిని తిని కరోనా బాధితులు రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అయితే ఫ్రూట్స్‌కు డిమాండ్ పెరగడంతో.. మార్కెట్‌లో వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా చోట్ల నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచి నయా దందా కొనసాగిస్తున్నారు. దీంతో సామాన్యులు ఏం చేయని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా బ్లాక్ మార్కెటింగ్ ఆధిపత్యం చలాయిస్తోంది.
ప్రస్తుతం కూరగాయలు, ఫ్రూట్స్ పెద్దమొత్తంలో అవసరం. దీంతో కొన్ని వీధుల్లో వీటిని అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీటి ఉత్పత్తి తక్కువగా ఉందని చెప్పి పండ్లను అధిక ధరకు అమ్ముతున్నారు. రిటైల్ షాపుల్లోనూ ఈ తంతే కొనసాగుతోంది. కరోనా వల్ల ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఫ్రూట్స్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నారింజ(ఓవర్సీస్ మాల్టా) కిలోకు రూ.200 నుంచి 300 అమ్ముతున్నారు. అదేవిధంగా రూ.10కే దొరికే కీవీ ఫ్రూట్.. ప్రస్తుతం రూ.36-40 వరకు పలుకుతోంది. దీని ఒక్కో బాక్స్ రూ.1000 నుంచి 1200 వరకు అమ్ముతున్నారు. నాసిక్ నుంచి వచ్చే దానిమ్మ పండు ధరలు కూడా భారీగా పెరిగాయి. వీటి హోల్‌సేల్ ధర కిలోకు రూ.70 నుంచి రూ.120 ఉంది. రిటైల్ మార్కెట్‌లో ఫ్రూట్స్ కిలోకు రూ.100-125కు అమ్ముతుండగా.. హోల్‌సేల్ ధర కిలోకు రూ.40-70 వరకు అమ్ముతున్నారు. కరోనా, ఎండాకాలం కావడంతో నిమ్మకాయలు, కొబ్బరినీటి డిమాండ్ కూడా పెరిగింది. వీటి ధర రిటైల్ మార్కెట్‌లో రూ.40 నుంచి 50 పలుకుతోంది.
మధ్యవర్తుల వల్లే ధర పెరిగాయి..
– ముఖేష్ కుమార్, ప్రెసిడెంట్, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ వర్క్స్ యూనియన్
కరోనా కారణంగా ఫ్రూట్స్ డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం కొబ్బరినీళ్లు, నిమ్మ, చెర్రీ, కీవీ, సిట్రస్ పండ్లు తదితర పండ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. టోకు మార్కెట్‌లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా.. వీధుల్లో వీటిని రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. రైతులను దోచుకుంటూ.. మధ్యవర్తులు నయా దందా చేస్తున్నారు.