సీఎం జగన్‌కు నవ సూచనలు చేస్తూ రఘురామరాజు మరో లేఖ

-

న్యూఢిల్లీ: వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ఇప్పటికే ప్రజా సమస్యలు, జగన్ హామీలపై 8 లేఖలు రాశారు. ఈ సారి నవ సూచనలతో పేరుతో తొమ్మిదో లేఖ రాశారు. ఏపీలో నడుస్తోన్న ఇసుక పాలసీపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. నిరాటంకంగా ఇసుక సరఫరా చేయాలని లేఖలో ప్రస్తావించారు. ఇసుక సరఫరా బాధ్యత కాంట్రాక్టర్‌కు అప్పగించాకే కొరత తీవ్రమైందని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రెండో ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని రఘురామ గుర్తు చేశారు. సీఎం ఇచ్చిన హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. అన్ని చోట్ల ఒకే ధరకు ఇసుక హామీ అమలు కావడం లేదని తెలిపారు. ప్రియమైన సీఎం జగన్ గారు…ఇసుక పాలసీపై సరైన విధాన్ని అమలు చేయాలని కోరుతూ రఘురామ లేఖ రాశారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. రోజుకో రేటుకు ఇసుక అమ్ముతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ స్పందించి వెంటనే ఇసుక విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. కొందరు నాయకులు దళారీలుగా మారి డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news