కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంఛార్జ్ కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెల్సిందే. అయితే పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాగా కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భట్టి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్ పై డబ్బుల అభియోగాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ మేరకు భట్టి విక్రమార్క మంగళవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లేనని.. త్వరలో హుజూరాబాద్ లో జరిగే ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ఓట్ బ్యాంక్ తో ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ తప్పనిసరిగా ఆమోదించాలని, అందరూ అమలు పరచాలని అన్నారు.