రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం సహజమే. అయితే ఇక్కడే కొన్ని విలువలు పాటిస్తే ఆ రాజకీయ నాయకులకు తిరుగుండదు. లేదంటే ప్రజల నుంచి తిరస్కరణకు గురవ్వడం ఖాయం. ఇప్పుడు అలా విలువలు పాటించని జంపింగ్ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఇబ్బంది పడటం ఖాయమని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున 19 మంది ఎమ్మెల్యేలని ప్రజలు గెలిపించారు. అంటే ఆ నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చినట్లు.
కానీ ప్రజల తీర్పుని కాదని ఓ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ కొట్టారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి లాంటి వారు మంత్రి కూడా అయ్యారు. అయితే అలా జంప్ అయిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీఆర్ఎస్ నుంచి అనూహ్యంగా బయటకొచ్చిన ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌కి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి, తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టించారు.
ఇక పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా ఈటల గెలిస్తే కేసీఆర్‌కు ఇబ్బంది తప్పదని, అలాగే జంపింగ్ ఎమ్మెల్యేల కొంపమునగడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ జంపింగ్ ఎమ్మెల్యేలు ఏ మాత్రం విలువలు పాటించకుండా పార్టీ మారిపోయారు.
ఇక ఇప్పుడు ఈటల ప్రభావంతో వారికి చుక్కలు కనబడతాయి. ఇప్పటికే వారు పదవులకు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఈటల గెలిస్తే వారి మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు తప్పించుకున్నా సరే వచ్చే ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలే చెక్ పెట్టేలా కనిపిస్తున్నారు. మరి వారిని గెలిపించడం కష్టమే అని తెలుస్తోంది.