హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంపై టిపిసిసి రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రేవంత్ అంటే పడని నాయకులు ఆయన టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ వల్లే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం వచ్చిందనే విధంగా మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు డైరక్ట్‌గానే విమర్శలు చేశారు. అయితే మొదట నుంచి కొందరు సీనియర్లు రేవంత్‌కు ఎలాగైనా చెక్ పెడదామనే ఉద్దేశంతో ఉన్న విషయం తెలిసిందే.
అందుకే సమయం కోసం ఎదురుచూస్తున్న నేతలు…హుజూరాబాద్ని సాకుగా చూపించి రేవంత్‌పై ఎటాక్ మొదలుపెట్టారు. అలాగే ఆయన్ని ఢిల్లీ అధిష్టానం వద్ద నెగిటివ్ చేయడానికి గట్టిగానే చూశారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమిపై ఢిల్లీలో సమీక్షా సమావేశం జరిగింది. ఏఐసీసీ సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, సీతక్క హాజరయ్యారు.
అయితే ఈ సమావేశంలో చర్చ రేవంత్ టార్గెట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది…సమావేశంలో పొన్నం ప్రభాకర్…మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్‌గా ఫైర్ అయ్యారు. కొందరు పరోక్షంగా టిఆర్ఎస్కు సహకరిస్తున్నారని పొన్నం, ఉత్తమ్‌ని ఉద్దేశించి అన్నారు. అలాగే తన సోదరుడు వరసైన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకునేందుకు పరోక్షంగా పనిచేశారని అన్నారు.
అలాగే హుజూరాబాద్ ఓటమిపై చర్చతో పాటు దుబ్బాక, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమిపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అంటే ఆ ఎన్నికలు ఉత్తమ్ సమక్షంలో జరిగాయి. అయితే రేవంత్‌ని కావాలనే టార్గెట్ చేస్తున్నారనే కోణంలో పొన్నం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో రచ్చ నడుస్తూనే ఉంది.