ప్రజారాజ్యం పార్టీ పుట్టక, మునక మనందరం చూశాం.. అప్పటి ఎలక్షన్స్‌లో ప్రజారాజ్యం పార్టీకి 68 లక్షల ఓట్లు పడ్డాయి.. 16 శాతం ఓట్లతో 18 సీట్లు గెలిచింది చిరంజీవి ప్రజారాజ్యం.. చాలా చోట్ల రెండో స్థానంలో నిలిచింది ఆ పార్టీ. సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడమే ఆ ఫలితాలకు కారణం లేదంటే రిజల్ట్ వేరేలా ఉండేది.. అయినా 18 సీట్లంటే మామూలు విషయం కాదు.. కానీ అతిగా ఊహించుకోవడమో లేక అవమానంగా ఫీలయ్యో ప్రజారాజ్యం జెండా పీకేశాడు చిరు. ఆ ఎన్నికల్లో తనకు ఇష్టం లేకుండా అన్నీ జరిగిపోయాయని ఫీలయిన పవన్ ప్రజారాజ్యానికి దూరంగా ఉన్నాడు. ఇదంతా మనకు తెలిసిన విషయాలే…
ఇప్పటి వరకు తన ఫ్యామిలీ నుండి జనసేనలోకి ఎవ్వరూ రారంటూ చెప్పుకొచ్చిన జనసేనాని.. మెల్లిగా తన కుటుంబ సభ్యులను తీసుకొస్తున్నాడు. మొన్న నాగబాబుని పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చాడు… తాజాగా గమనిస్తే పవన్ స్పీచ్చుల్లో చిరంజీవి మాట తెస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీని తొక్కేశారని.. తన అన్నని మోసం చేశారని.. ఉన్నట్టుండి అన్న గురించి ఎందుకు చెబుతున్నాడా అన్న అనుమానం కలుగుతుంది కదా.. అదే విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే.. జనసైనికులను కదిలిస్తే… తెలుస్తున్నవిషయాలు షాకింగ్ గా అనిపించక మానదు..
తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీని గెలిపించటానికి చిరంజీవి రంగంలోకి దిగుతున్నాడనేది ఆ వార్తల సారాంశం.. నటుడిగా చిరంజీవి అంటే లక్షల మందికి అభిమానం ఉండొచ్చు కానీ రాజకీయంగా మాత్రం చిరంజీవి అంటే ఎవ్వరికీ మంచి అభిప్రాయం లేదు.. ఇప్పటికీ చిరంజీవి, ప్రజారాజ్యం ప్రభావం పవన్ పై ఉండనే ఉంది. దాన్ని అధిగమించేందుకు జనసేనాని అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న జనసేన పార్టీకి చిరు ఎంట్రీ కలిసొచ్చే విషయం కాకపోగా.. మైనస్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
కాంగ్రెస్‌లో వారసత్వం.. టీఆర్‌ఎస్‌లో వారసత్వం.. తేదేపాలో వారసత్వం.. అంటూ విమర్శిస్తున్న పవన్ ఇప్పుడు బ్రదర్స్ ఎంట్రీని ఎలా సమర్థించగలడు… ఎమో ఇప్పటి వరకు ఇది గాలి వార్తే కానీ… నిజమైతే మాత్రం జనసేనకు చిరు ఎంట్రీ నష్టమే ..
-RK