ఉగాది వేళ కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ శ్రీకారం దిద్దుతున్నారు.కొన్నింట పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా కొన్నింట మాత్రం స్పష్టమైన వైఖరి లేక ఇవాళ్టికీ వాటిపై ఎటువంటి ప్రకటన రాక అవస్థ పడుతున్న రాజకీయ నాయకులు ఎందరో ! రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేసే విధంగా కొన్ని చోట్ల విభజన ఉందని ఎన్నో సార్లు మొత్తుకుంటున్న వైసీపీ నాయకులకు జగన్ నుంచి మౌనమే సమాధానం అవుతోంది. నా మాటే శాసనం అన్న విధంగా ఉండే జగన్ ను నిలువరించడం సాధ్యం కాని పని.
ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఎవ్వరికీ తెలియవు. ఆయన మనస్సు సలహాదారుల మాట వింటుంది అని అనుకుంటే అంతకు మించిన అవివేకం ఇంకొకటి లేదు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి కొన్ని అభ్యంతరాలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది 371డీ ప్రకారం విరుద్ధం అని తేల్చేస్తోంది కోర్టు.
ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు అన్నది అశాస్త్రీయ సంబంధ చర్య అని బీజేపీ కూడా గగ్గోలు పెడుతోంది.ఎందుకంటే జనాభా లెక్కలు తేలకుండా సరిహద్దులు మార్చడం అన్నది కుదరని పని అని కేంద్రం ఎప్పుడో చెప్పేసింది కూడా! కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది రాష్ట్రం అంతర్గత వ్యవహారంగానే చూస్తుంది తప్ప వాటితో మాకేం పని అన్న విధంగా ఓ శ్రోత మాదిరి ఉంటోంది.
ఇంకా చెప్పాలంటే తనదైన వ్యూహాత్మక మౌన వైఖరిని ఒకటి పాటిస్తోంది.ఈ దశలో హై కోర్టులో పిల్ దాఖలయింది. కొత్త ఏడాది ఆరంభంలో జనవరి 25 ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ చట్టవిరుద్ధం అయిందంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.దీనిని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు పిటిషనర్లు.దీనిపై ఇవాళ అంటే సోమవారం ఏం చెప్పనుందో కోర్టు అన్నది అత్యంత ఆసక్తికర పరిణామం.