అవసరం మనిషిని ఏదైనా చేయిస్తుంది.. పరిస్థితులు మనవి కానప్పుడు కూడా.. నెగ్గుకురావడమే లైఫ్. అసలు జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది కదూ.. అప్పటివరకూ అంతా బానే ఉంటుంది.. ఒక్క మూమెంట్ తో లైఫ్ అటో ఇటో అనే పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్విచ్చువేషన్ చాలామంది వారి జీవితంలో ఫేస్ చేసే ఉంటారు. అక్షరం ముక్క రాదు.. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు కానీ.. ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఓనర్ అయింది ఆ మహిళ.. అవడమేనా.. నెలకు 70 వేలు సంపాదించేస్తుంది. భలే ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.. పూర్తిగా చూసేద్దామా..!
ఉత్తరప్రదేశ్‌లోని రఖ్వా అనే గ్రామం చాలా వెనుకబడిన ప్రాంతం. అక్కడ కనీస మౌలిక వసతులు లేక, వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేక.. ఈరోజుకి అక్కడి ప్రజలు వెనుకబడే ఉన్నారు. కానీ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. అధునాతనమైన సాంకేతికతను అందిపుచ్చుకొని కొందరు తమ జీవితాలను మార్చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల శశికల చౌరాసియా తన పిల్లల ప్రోత్సాహంతో ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఓనర్ అయిపోయింది. శశికలకు పాకశాస్త్రంలో మంచి నైపుణ్యం ఉంది.
తను వంటలు బాగా చేస్తుంది. చెప్పాలంటే.. మన తెలుగు సీరియల్ లో వంటలక్క టైప్.. ఇది గమనించిన పిల్లలు చందన్, సూరజ్, పంకజ్.. వాళ్లమ్మ పేరుమీద ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టించాలనుకున్నారు. అదే విషయం శశికళకు చెప్పినప్పుడు అసలు తనకు ఇంటర్నెట్ అంటేనే తెలియదని భయపడింది. కానీ.. తన కొడుకుల ప్రోత్సాహంతో అడుగు ముందుకేసింది..
తాలి అనే యూట్యూబ్ చానెల్‌ను కుమారుడు చందన్ క్రియేట్ చేశాడు. నవంబర్ 1, 2017న మొదటి వీడియోను అప్లోడ్ చేశారు. బూందీ ఖీర్‌ను తన తల్లి తయారు చేయగా.. తన కొడుకు చందన్ షూట్ చేసి. ఛానల్ లో అప్లోడ్ చేశాడు. కానీ.. ఆ వీడియోకు పెద్దగా వ్యూస్ రాలేదు. అంతేగా ఫస్ట్ లో ఎవరూ దేకరూ.. మనకూ తెలుసు కదా..!
తన తల్లితో రోజూ రకరకాల వంటలు చేయిస్తూ తల్లిని చెఫ్‌గా మార్చేశారు. రోజూ ఆ వీడియోలు అప్లోడ్ చేస్తూ వెళ్లిపోయారు. కట్ చేస్తే.. 2018లో మామిడికాయ పచ్చడి చేసే విధానానికి సంబంధించిన వీడియోకు ఓ రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. అప్పటి నుంచి ఇక శశికల వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు తన యూట్యూబ్ చానెల్‌కు 1.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు యూట్యూబ్ ఛానెల్ ద్వారా 70 వేల ఆదాయం వస్తోంది.
కుటుంబసభ్యుల ప్రోత్సాహం, పట్టువిడువకుండా శ్రమించే ఓపిక ఉంటే విజయం ఏనాటికైనా వరించితీరుతుంది. మీలో కూడా చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని వీడియోస్ చేస్తుంటారు కానీ.. పెద్దగా వ్యూస్ రావడం లేదని నిరాశతో విరమించుకుంటారు. కొన్ని ఏళ్లు కష్టపడితే కానీ..ప్రపంచం మనల్ని గుర్తించదు. ఇప్పుడు ఏ వీడియో పెట్టినా వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్ వచ్చే వారి అకౌంట్ లో మొదట అప్ లోడ్ చేసిన వీడియోస్ చూడండి.. మీకే అర్థమవుతుంది.. ఎన్ని మెట్లు ఎక్కితే వారి ఆ స్టేజ్ కు వెళ్లారో.. ఏపని అయినా.. వదలకుండా చేసినప్పుడే ఆగకుండా విజయాలు వస్తాయి.
-Triveni Buskarowthu